బషీర్‌బాగ్, వెలుగు : ‘దేశవ్యాప్త జనగణనలో భాగంగా బీసీ కులాల లెక్కలు కూడా తీస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు, కానీ కొంతమంది కావాలనే పార్లమెంట్ ముందు ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీ బీసీల పట్ల సానుకూలంగా ఉన్నారని, కులాల లెక్కలు తేలిన తర్వాత, చట్టబద్ధమైన హక్కులతో రిజర్వేషన్లు కల్పిస్తారన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు కోసం ఈ నెల 30, 31న ఢిల్లీలో బీసీల జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సెమినార్‌కు కేంద్ర మంత్రులతో పాటు పలువురు ఎంపీలు హాజరుకానున్నారన్నారు.
ఈ సెమినార్ ద్వారా బీసీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, ఒత్తిడి తెస్తామని చెప్పారు. సమావేశంలో బీసీ సంఘ నాయకులు పగిళ్ల సతీష్, రాజేందర్, నీల వెంకటేశ్, అనంతయ్య, జి.అంజి, పృథ్విరాజ్‌గౌడ్ పాల్గొన్నారు.
