మహిళా బిల్లుకు రాజ్యసభ ఓకే.. 215 ఓట్లతో ఏకగ్రీవంగా ఆమోదం

మహిళా బిల్లుకు రాజ్యసభ ఓకే..     215 ఓట్లతో ఏకగ్రీవంగా ఆమోదం
  •     దాదాపు 11 గంటలకు పైగా చర్చ  
  •     ఇక రాష్ట్రాల ఆమోదం.. రాష్ట్రపతి సంతకమే తరువాయి 
  •     ముగిసిన సమావేశాలు
  •     పార్లమెంట్​ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ : చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గురువారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌‌ రామ్‌‌ మేఘ్వాల్‌‌ బిల్లును ప్రవేశపెట్టగా, దాదాపు 11 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ నిర్వహించగా, మొత్తం 215 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో కనీసం సగానికి పైగా రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే, బిల్లు చట్టరూపం దాల్చనుంది. 

రిజర్వేషన్లు ఇప్పుడే సాధ్యం కాదు: నిర్మల 

చట్ట ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాత మాత్రమే సాధ్యమవుతుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను ఇప్పుడే అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. జనాభా లెక్కలు పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని పేర్కొన్నారు. రాజ్యసభలో ఉన్న ఎన్నికల విధానం కారణంగా.. ఈ సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని వెల్లడించారు.

కాగా, గురువారం రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. 2014, 2019 లోక్​సభ ఎన్నికల టైమ్​లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తామని చెప్పి మోసం చేసిందని  విమర్శించారు. తొమ్మిదేండ్లుగా బిల్లు ఆమోదం పొందలేకపోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమన్నారు. గురువారం నాటితో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగిశాయి.  దీంతో పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 

దేశ ప్రజలందరికీ అభినందనలు: ప్రధాని మోదీ 

రాజ్యసభలో కూడా మహిళా రిజర్వేషన్ల బిల్లు పాస్ కావడంతో దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇది మన దేశ ప్రజాస్వామ్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భమని ట్వీట్ చేశారు. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు రాజ్యసభ ఎంపీలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అందరూ మద్దతు తెలిపినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ బిల్లు పాస్ కావడంతో దేశ రాజకీయాల్లో కొత్త యుగం ప్రారంభమవుతుందన్నారు.

అమలు ఎప్పుడో చెప్పండి : ఖర్గే 

మహిళా రిజర్వేషన్లు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కేంద్రాన్ని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో కూడా ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలన్నారు. ‘‘మహిళా రిజర్వేషన్లను జనాభా లెక్కలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న సీట్ల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత సీట్ల సంఖ్య పెరిగినప్పుడు..

మహిళా రిజర్వ్‌‌డ్ సీట్ల సంఖ్యను పెంచవచ్చు” అని సూచించారు. దీనిపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందిస్తూ.. రిజర్వేషన్ల అమలుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని, అందుకే బిల్లులో ఆ మేరకు నిబంధనలు చేర్చామని పేర్కొన్నారు.