జవాన్‍ కావాల్సినోడు.. పోలీసు తూటాకు బలి

జవాన్‍ కావాల్సినోడు.. పోలీసు తూటాకు బలి
  • సికింద్రాబాద్‌‌లో కాల్పుల్లో చనిపోయిన రాకేశ్‍
  • అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరాలనుకున్నడు
  • వరంగల్‍ జిల్లా దబీర్‍పేటలో విషాదం

వరంగల్‍/ నర్సంపేట/ మహబూబాబాద్, వెలుగు: అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరాలనుకున్నడు.. బీఎస్ఎఫ్‍, సీఆర్‍పీఎఫ్‍ ఫిజికల్‍ టెస్టుల్లో అర్హత సాధించి.. రాత పరీక్షల కోసం మూడేండ్లుగా ప్రిపేర్ అవుతున్నడు. కానీ జవాన్‍ కావాల్సిన వ్యక్తి పోలీసు తూటాకు బలయ్యాడు. శుక్రవారం సికింద్రాబాద్‍ రైల్వే స్టేషన్‌‌లో జరిగిన కాల్పుల్లో దామెర రాకేశ్‍ (23) ప్రాణాలు కోల్పోయాడు. అగ్నిపథ్‌‌ పథకానికి నిరసనగా సికింద్రాబాద్‌‌లో జరిగే ఆందోళనల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు చెందిన మరికొందరితో కలిసి రాకేశ్​ వెళ్లాడు. అక్కడ జరిగిన కాల్పుల్లో అతడు చనిపోయినట్టు సికింద్రాబాద్​ నుంచి అధికారులు ఇచ్చిన సమాచారాన్ని లోకల్‍ పోలీసులు బాధిత తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు, అన్న ఆటోలో నర్సంపేటకు చేరుకోగా.. అక్కడ నుంచి వారిని పోలీసు వాహనాల్లో హైదరాబాద్‌‌కు తీసుకువెళ్లారు.

జవాన్‌‌లా హెయిర్‌‌‌‌ స్టయిల్, డ్రస్సింగ్

వరంగల్ జిల్లా ఖానాపూర్‍ మండలం దబీర్‍పేటకు చెందిన రైతు దామెర కుమారస్వామి, పూలమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వీరి రెండో కూతురు రాణి ఐదేండ్ల కింద బీఎస్‍ఎఫ్‍ జవాన్‍గా ఎంపికైంది. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగాల్‍లో పనిచేస్తోంది. ఇంట్లో చిన్నవాడైన రాకేశ్‍ తన చిన్నక్క రాణిని స్ఫూర్తిగా తీసుకుని జవాన్ కావాలనుకున్నాడు. డిగ్రీ ఫైనలియర్‍ చదువుతున్న అతడు.. మూడేండ్ల నుంచి సీరియస్‍గా ప్రిపేర్‍ అవుతున్నాడు. మొదట ఏపీలోని బాపట్ల ఆర్మీ కోచింగ్‍ సెంటర్‌‌‌‌లో, తర్వాత వరంగల్‌‌లో ట్రైనింగ్‍ తీసుకున్నాడు. ఇటీవల బీఎస్‍ఎఫ్‍, సీఆర్‍పీఎఫ్‍ నిర్వహించిన ఫిజికల్‍ టెస్టుల్లో క్వాలిఫై అయ్యాడు. హనుమకొండలో ఉంటూ రాత పరీక్ష కోసం ప్రిపేర్‍ అవుతున్నాడు. అతని హెయిర్‍ స్టయిల్, డ్రెస్‌‌లు, ఫేస్‍బుక్‍ పోస్టింగులు, ఫొటోలు అన్నీ ఆర్మీ జవాన్‌‌ను తలపించేలా ఉండేవి.

దబీర్‍పేట కన్నీటిమయం

రాకేశ్‍ మృతిలో సొంతూరు దబీర్‍పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారస్వామి పెద్ద కొడుకు గతంలో జరిగిన యాక్సిడెంట్‍ కారణంగా వికలాంగుడయ్యాడు. ఇద్దరు ఆడబిడ్డలకు పెళ్లిళ్లయి వెళ్లిపోవడంతో రాకేశ్ అన్నీతానై కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. రాకేశ్‍ మరణంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. రాకేశ్ అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

వినయ్ పరిస్థితి విషమం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌లో జరిగిన ఆందోళనలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ (22) తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. లక్క వెంకన్న, సుభద్ర దంపతులకు నవీన్, వినయ్ కొడుకులు. వీరిద్దరు ఆర్మీలో చేరాలనే లక్ష్యంతో హైదరాబాద్‌‌లో కోచింగ్ తీసుకుంటున్నారు. 2021లో జరిగిన ఆర్మీ రిక్రూట్‌‌మెంట్ ర్యాలీలో వినయ్ ఫిజికల్ టెస్టుల్లో క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో కోచింగ్ తీసుకుంటున్న కొందరు మిత్రులతో కలిసి నవీన్, వినయ్ సికింద్రాబాద్ వెళ్లారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో వినయ్ చాతిలో బుల్లెట్ దిగింది. అతడికి గాంధీ హస్పిటల్‌‌లో చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి తెలిసి కుటుంబసభ్యులు హైదరాబాద్‌‌ చేరుకున్నారు. తమ కుమారుడిని పోలీసులు చూడనివ్వలేదని వారు ఆందోళన చెందుతున్నారు. తనకు చాలా నొప్పిగా ఉందని, తనకేమైనా జరిగితే పోలీసులు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌నాథ్ సింగ్ బాధ్యత వహించాలంటూ వినయ్ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.