భక్త జనసందోహం : అయోధ్యలో 20 గంటలు బాలరాముడి దర్శనం

భక్త జనసందోహం : అయోధ్యలో 20 గంటలు బాలరాముడి దర్శనం

అయోధ్యలో  ఏప్రిల్ 9 నుంచి   శ్రీ రామనవమి వేడుకలు  ప్రారంభం కానున్నాయి. బాల రాముడి దర్శనానికి దాదాపు 50లక్షల మంది భక్తులు  తరలివస్తారని అంచనా వేస్తున్నారు ఆలయ అధికారులు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడు రోజులు  24 గంటల పాటు  రామ్ లల్లా దర్శనానికి అనుమతించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అయోధ్య జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.   

అయితే సుధీర్ఘ చర్చల తర్వాత 24 గంటల పాటు  రామ్ లల్లా దర్శనం కుదరదని.. 20 గంటల పాటు  ఆలయం తెరిచి ఉంచుతున్నట్లు   శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. రాముడి గుడి తలుపులు 20 గంటల పాటు తెరిచి ఉంటాయని..రామ్ లల్లాకు 4  గంటలు విశ్రాంతి కల్పిస్తామని తెలిపింది.  ప్రస్తుతం రోజులో 14 గంటలు ఆలయాన్ని తెరిచి ఉంచుతున్నారు.  ప్రతి రోజు దాదాపు రెండు లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు.  

మణిరామ్ దాస్ కంటోన్మెంట్‌లో ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరామనవమి వేడుకలకు  ఏడు లైన్లలో భక్తులను దర్శనానికి అనుమతించడంతో పాటు 20 గంటల పాటు రాంలాలా దర్శనం చేసుకునే  అవకాశాన్ని భక్తులకు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.  రాముడికి ప్రతిరోజూ నాలుగు గంటలు విశ్రాంతి ఉంటుందని..శ్రీరామ నవమి సందర్భంగా ఎక్కువ సేపు దర్శనానికి అనుమతిస్తున్నట్లు  ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్  వెల్లడించారు. సాధ్యమైతే సూర్యుడి దివ్య కిరణాలతో రామ్‌లాల్లాను అభిషేకించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాయ్ వెల్లడించారు.

ఏప్రిల్ 15 నుండి 18 వరకు అన్ని VIP పాస్‌లను రద్దు చేస్తున్నట్లు రాయ్ ప్రకటించారు. దర్శన మార్గంలో నీడ, సీటింగ్ సదుపాయం,  నీటి సౌకర్యాలు..  తగిన రెస్ట్‌రూమ్ సౌకర్యాలతో  భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.