పోడు వ్యవహారంపై రాష్ట్రపతితో రామచంద్రు తెజావత్ భేటీ

పోడు వ్యవహారంపై రాష్ట్రపతితో రామచంద్రు తెజావత్ భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పోడు భూముల వ్యవహారంలో గిరిజనులకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వ మాజీ స్పెషల్ రిప్రజెంటీవ్ రామచంద్రు తెజావత్ రాష్ట్రపతి ముర్మును కోరారు. ఫారెస్ట్ కన్జర్వేషన్​ యాక్ట్, ఫారెస్ట్ రైట్ యాక్ట్, స్టేట్ రెవెన్యూ యాక్ట్ ల నుంచి ట్రైబల్స్ ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలోని ప్రెసిడెంట్ హౌజ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన అర గంటకు పైగా భేటీ అయ్యారు. గిరిజన హక్కులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రపతితో చర్చించారు.

ఈ సందర్భంగా గిరిజనులకు సంబంధించిన 9అంశాలను ప్రస్తావించారు. రాజ్యసభ, శాసనసభల్లో, ఉన్నత న్యాయ వ్యవస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర గవర్నర్ల నియామకాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లైన ఎస్సీ, ఎస్టీలను సొంత రాష్ట్రాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 నుంచి 11 దాకా ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ఫిథియన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ గేమ్స్ వేడుకల ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.