రంజాన్ సీజన్లో ఇఫ్తార్ విందులంటే.. కచ్చితంగా నోరు తీపి చేసే స్వీట్, ఒంటికి చలువ చేసే ఖీర్, డ్రింక్స్ వంటివి ఉండాల్సిందే. రంజాన్ రోజు కూడా ఇవి కామన్. కాబట్టి ఎప్పటిలా రెగ్యులర్ రెసిపీలు కాకుండా ఇలా కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయండి. వీటి టేస్ట్ తప్పకుండా నచ్చుతుంది!
కస్టర్డ్ డెజర్ట్
కావాల్సినవి : పాలు: రెండు కప్పులు కస్టర్డ్ పౌడర్, చక్కెర: పావు కప్పు కేరమెల్ సాస్ కోసం: చక్కెర: పావు కప్పు నీళ్లు, కార్న్ ఫ్లోర్: ఒక్కో టేబుల్ స్పూన్ పాలు : ముప్పావు కప్పు
తయారీ : ఒక గిన్నెలో పాలు పోసి కస్టర్డ్ పౌడర్, చక్కెర వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరపడేవరకు ఉండలు కట్టకుండా బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక కప్‌లో పోయాలి. ఒక పాన్‌లో చక్కెర వేసి, నీళ్లు పోసి కరిగించాలి. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్ వేసి పాలు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కాగుతున్న చక్కెర పాకంలో వేసి కలపాలి. చివరిగా రెడీ అయిన కేరమెల్ సాస్ని కస్టర్డ్ మిశ్రమం వేసుకున్న కప్‌లో పైన లేయర్‌లా వేయాలి.
రైస్ ఖీర్
కావాల్సినవి : బాస్మతీ రైస్: పావు కప్పు, పాలు: లీటర్,
చక్కెర: అర కప్పు, యాలకుల పొడి: పావు టీస్పూన్,
బాదం పప్పు: రెండు టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు: చిటికెడు
బాదం పప్పు: 50 గ్రాములు, కేవ్రా వాటర్: అర టీస్పూన్
తయారీ : బాస్మతీ రైస్‌ని కడిగి, గంటసేపు నానబెట్టాలి. తర్వాత ఆ బియ్యాన్ని మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో పాలు కాగబెట్టి అందులో గ్రైండ్ చేసిన బియ్యం కూడా వేయాలి. తర్వాత చక్కెర కూడా వేసి కరిగించాలి. ఆపై యాలకుల పొడి వేయాలి. మరికాసేపు కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక అందులో బాదం పప్పు తరుగు, కోవా వేసి బాగా కలపాలి. చివరిగా కేవ్రా వాటర్ కూడా వేసుకుంటే సరి. ఇది సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్లో దొరుకుతుంది.
కోకోనట్ మిల్క్ డ్రింక్
కావాల్సినవి :
టెంకాయ : ఒకటి
బాదం, జీడిపప్పు :
పదేసి చొప్పున
నీళ్లు: సరిపడా
కర్జూరలు : ఐదు
కొబ్బరి నీళ్లు: అర కప్పు
కండెన్స్డ్ మిల్క్ :
వంద గ్రాములు
తయారీ: జీడిపప్పు, బాదం నానబెట్టాలి. టెంకాయలోని కొబ్బరిని సన్నగా తురమాలి. ఆ కొబ్బరి తురుమును మిక్సీజార్‌లో వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ కొబ్బరి మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్‌తో వేసి గట్టిగా చేత్తో పిండితే కొబ్బరి పాలు వస్తాయి. ఆ పాలను జల్లెడ పట్టి, ఒక గిన్నెలో పోయాలి. మిక్సీజార్‌లో నానబెట్టిన జీడిపప్పు, బాదం వేసి, కొబ్బరి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ నీటిని కొబ్బరి పాలలో పోయాలి. ఆపై కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలపాలి. చివరిగా ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి పండ్లు కట్ చేసి మిశ్రమంలో కలుపుకోవచ్చు.
