రామగుండం కార్పొరేటర్ల మేడారం టూర్..పార్టీలకతీతంగా 30 మంది

రామగుండం కార్పొరేటర్ల మేడారం టూర్..పార్టీలకతీతంగా 30 మంది
  •     ఐక్యత కోసమా...? అసంతృప్తిని తెలిపేందుకా...?

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్​లోని 30 మంది కార్పొరేటర్లు పార్టీలకతీతంగా బుధవారం మేడారం టూర్​కు తరలివెళ్లారు. 20 మంది కాంగ్రెస్​, ఎనిమిది మంది బీఆర్ఎస్​, సీపీఐ, బీజేపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున ఈ టూర్​లో పాల్గొన్నారు. కార్పొరేషన్​ ఎన్నికలు ముగిసి (మేయర్​, డిప్యూటీ మేయర్​ మినహా) 58 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తమకు సరైన గౌరవం దక్కడం లేదని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ప్రోటోకాల్​ పాటించడం లేదని, ప్రజా సమస్యలపై ఇచ్చే వినతులను అధికారులు పట్టించుకోవడం లేదనే అసంతృప్తిలో ఉన్నారు. ఆఫీస్​లో కార్పొరేటర్లు కూర్చోవడానికి, చర్చించుకోవడానికి కనీసం వెయిటింగ్​ హాల్​ కూడా లేకపోవడం, కమిషనర్​, మేయర్​ డివిజన్ల పర్యటనకు వచ్చిన సందర్భంలో సమాచారం ఇవ్వకపోవడం, తదితర అంశాలపై కార్పొరేటర్లు తమదైన పద్దతిలో నిరసన తెలుపుతూ వస్తున్నారు. 

ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్​ గచ్చిబౌలీలో నిర్వహించిన శిక్షణకు మెజార్టీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కాగా పార్టీలకతీతంగా రామగుండం కార్పొరేటర్లు మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జాతరకు బుధవారం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.  కార్పొరేటర్లు  మాత్రం కేవలం అమ్మవార్ల దర్శనానికి వెళ్లామని పైకి చెబుతున్నా...తామంతా ఐక్యంగా ఉన్నామనే సంకేతాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకువస్తూ తమ అసంతృప్తిని తెలిపేందుకు ఈ టూర్​ చేసినట్టు స్పష్టమవుతున్నది.