సింగరేణి ఓపెన్ కాస్ట్ తో రామప్పకు ముప్పు.. పర్మిషన్ ఇస్తే సరస్సు సైతం ఖాళీ

సింగరేణి ఓపెన్ కాస్ట్ తో రామప్పకు ముప్పు.. పర్మిషన్ ఇస్తే సరస్సు సైతం ఖాళీ
  • రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్​ఆకిరెడ్డి వెంకట రాంమోహన్ రావు

ములుగు, వెలుగు : సింగరేణి ఓపెన్ కాస్ట్ గనితో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయానికి ముప్పు వాటిల్లుతుందని రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్​ ఆకిరెడ్డి వెంకట రాంమోహన్​రావు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి ఓపెన్​కాస్ట్ పర్మిషన్ ను రద్దు చేయాలని కోరారు. ములుగులోని రిటైర్డ్​ఉద్యోగుల భవనంలో గురువారం మీడియాతో మాట్లాడారు. 

ఓపెన్ కాస్ట్ పనులు చేపట్టేందుకు ఇటీవలి కాలంలో కేంద్ర మైనింగ్​శాఖకు సంబంధించిని ఇంజినీర్లు వచ్చి పరిశోధనలు చేశారని, అయితే రామప్ప ఆలయం, చెరువు కింది భాగం నుంచి జలధార ఉన్నట్లు నిపుణులు గుర్తించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ కు పర్మిషన్ ఇస్తే ఇసుకతో నిర్మించిన రామప్ప గుడికి ముప్పు పొంచి ఉంటుందన్నారు. రామప్ప ఆలయంతో పాటు సరస్సు సైతం ఖాళీ అవుతుందని, దీనిపై ఆధారపడి మత్స్యకార కుటుంబాలు, రైతులు ఇబ్బందుల్లో పడుతారని ఆందోళన వ్యక్తం చేశారు. 

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కిన నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్కకు స్థానికులు వినతిపత్రాలు అందజేశారన్నారు. సీఎం, కేంద్ర మంత్రులు స్పందించి రామప్ప ఆలయ అస్తిత్వానికి ముప్పు కలిగేలా  ఉన్న ఓపెన్ కాస్ట్ కు పర్మిషన్ రాకుండా చూడాలని కోరారు. ఇక్కడ కేవలం 18 ఏండ్ల వరకే బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండగా.. ఈ గని వల్ల  800 ఏండ్ల నాటి ఆలయానికి ముప్పు కలుగుతుందన్నారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ను విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం  చుడతామని హెచ్చరించారు. ఆయన వెంట న్యాయవాది వల్లాల నాగరాజు ఉన్నారు.