- మహిళా రిజర్వేషన్లు ఆపేందుకే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: మహిళా సాధికారత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. డీలిమిటేషన్ పేరుతో దేశంలో సీఎం రేవంత్ రెడ్డి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
బుధవారం బీజేవైఎం, మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా హైదరాబాద్‌లోని నారాయణగూడ నుంచి అసెంబ్లీ వరకు నిర్వహించిన స్కూటీ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా బిల్లు అమలు కావాలంటే డీలిమిటేషన్ తప్పనిసరని, అది జరగకుండా రిజర్వేషన్లు అమలు చేయడం ఎలా సాధ్యమవుతుందో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైడ్రీడ్ మోడల్ ప్రపంచంలోఎక్కడా లేదు..
వరంగల్/ హనుమకొండ, వెలుగు: డీలిమిటేషన్‍పై సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న హైబ్రీడ్ మోడల్ ప్రపంచంలో ఎక్కడాలేదని రాంచందర్రావు అన్నారు. మహిళా బిల్లును ఆపే కుట్రలో భాగంగానే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. బుధవారం గ్రేటర్ వరంగల్లో పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు జీఎస్డీపీ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సీట్లు పెరుగుతాయని.. వెనకబడిన ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్నారు.
దేశంలో 70 కోట్ల జనాభా ఉన్నప్పుడు 540 పార్లమెంట్ సీట్లున్నాయని.. జనాభా 140 కోట్లకు పెరిగినా అన్నే సీట్లు ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే సెక్షన్ 81 ప్రకారం ప్రాక్టికల్‍గా డీలిమిటేషన్ జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రభుత్వం మహిళా బిల్లు పెడుతుంటే డీలిమిటేషన్ పేరుతో రేవంత్ రెడ్డి దానిని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పూర్తి మెజార్టీ ఉన్నా.. ఎందుకు మహిళా బిల్లును ఆమోదించలేదని ఆయన ప్రశ్నించారు.

