- కేంద్రం ధాన్యాన్ని కొంటుంటే.. క్రెడిట్ కొట్టేది రేవంత్ సర్కార్
- మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డుకు మోదీనే దిక్కు అని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వమని.. రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై వారికి నమ్మకం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. అందుకే దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని గుర్తుచేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ కుటుంబ పాలన నడుపుతోందన్నారు. అధ్యక్షుడు ఎవరైనా కావొచ్చని.. కానీ, నిర్ణయాలు మాత్రం కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయని చెప్పారు.
ఇదే నియంతృత్వ ధోరణి తెలంగాణలోనూ అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని రాంచందర్ రావు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో సగానికి పైగా (55.31 లక్షల మెట్రిక్ టన్నులు) తెలంగాణ నుంచే కేంద్రం సేకరించిందన్నారు.
రైతులకు రూ.13,171 కోట్లు చెల్లించింది కేంద్రమేనని.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తామే కొన్నట్టు ఫోజులు కొడుతోందని విమర్శించారు. నెల రోజుల పాటు కొనుగోలు కేంద్రాలు తెరవకుండా ప్రభుత్వం నిద్రపోయిందని, బీజేపీ పోరాటంతోనే దిగొచ్చిందని గుర్తుచేశారు. రాబోయే సీజన్‌లో అయినా రైతులను ఇబ్బంది పెట్టకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాని, రాష్ట్రపతిపై అసహనమెందుకు?
ఓబీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ, గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటే కాంగ్రెస్ నాయకులకు గౌరవం లేదని రాంచందర్ రావు ఆరోపించారు. ప్రధానిని, రాష్ట్రపతిని విమర్శిస్తూ ఒకే కుటుంబానికి విధేయత చూపడం కాంగ్రెస్ నాయకుల బానిస మనస్తత్వానికి నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని.. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతుండటంతో ఆయనలో భయం మొదలైందని పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రమే నిధులు ఇచ్చిందని, అనుమతులు మంజూరు చేసిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా ఇవ్వకుండా, భూసేకరణ పూర్తి చేయకుండా కేంద్రాన్ని నిందించడం హాస్యాస్పదమన్నారు. మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ విషయంలోనూ రేవంత్ రెడ్డి అసత్యాలు చెబుతున్నారని, సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక అభ్యర్థన వెళ్లలేదని ఫడ్నవీస్ కార్యాలయమే స్పష్టం చేసిందని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నట్లు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కమీషన్ల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. తమ మీద ఎంత బురద జల్లితే అంతగా కమలం వికసిస్తుందని, తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
