
కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న మూవీ మౌత్ టాక్ తో రికార్డ్ లు సృష్టిస్తోంది. ప్రభాస్, అనుష్క , సుదీప్ వంటి నటులు ఈ సినిమాపై ఇప్పటికే ప్రశంసలు కురిపించారు. ఇపుడు ఈ లిస్ట్ లో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా చేరారు. వరుస ట్వీట్లతో కాంతర సినిమాను ఆకాశానికెత్తేశాడు. చిన్న సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. భారీ బడ్జెట్ సినిమాల రికార్డ్ లను బద్దలు కొడుతోందని ట్వీట్ చేశారు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలకు ఈ సినిమా కలెక్షన్లు ఓ పీడకల అని.. రూ.300 కోట్లు, 400కోట్లు, 500 కోట్ల బడ్జెట్ సినిమాలు తీసే వాళ్లకి ఈ సినిమా హార్ట్ ఎటాక్ తీసుకొస్తుందన్నారు.
అంతేగాకుండా రాబోయే తరాలకు కాంతార ఓ గుణపాఠం అన్నారు. భారీ బడ్జెట్ సినిమాలే ప్రేక్షకులను ధియేటర్ల్లకు రప్పిస్తాయనే నానుడిని కూడా కాంతార సినిమాతో రిషబ్ షెట్టి మార్చేశాడన్నారు. కాంతార వంటి అద్భుతమైన సినిమాని అందరికీ అందించినందుకు ధన్యవాదాలు తెలిపిన వర్మ.. సినీ ఇండస్ట్రీ వారంతా మీకు ట్యూషన్ ఫీజు చెల్లించాలంటూ వర్మ కామెంట్ చేశారు.
ముందుగా కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ తెలుగు,హిందీ,తమిళంలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. అంతేగాకుండా ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది. డైరెక్టర్ రిషబ్ ప్రధాన పాత్రలో నటించిన కాంతారా KGF 2, RRR బ్రహ్మాస్త్ర వంటి పెద్ద చిత్రాలను బీట్ చేసింది. కాంతారా IMDB రేటింగ్ 9.4, KGF 2 రేటింగ్ 8.4, RRR 8, బ్రహ్మాస్త్ర రేటింగ్ కేవలం 5.6 గా ఉంది.