
ఎమ్మెల్సీల అనర్హత వేటు వ్యవహారంలో రాములు నాయక్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఫైనల్ తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపవద్దని తెలంగాణ ప్రభుత్వం, మండలి ఛైర్మన్ కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తనపై అనర్హత వేటు విధిస్తూ అప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాములు నాయక్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
అంతేకాకుండా మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం సరైందేనని సమర్థించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు తన పిటిషన్ కొట్టివేయడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో రాములు నాయక్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో తర్వాతి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.