రైతుల కోసం రామసేతు యాప్

రైతుల కోసం రామసేతు యాప్
  •  తక్కువ అద్దెకు అగ్రి మెషినరీలు
  •  బుక్ చేసుకుంటే నేరుగా పొలానికే
  •  యాప్ రూపొందించిన సికింద్రాబాద్ కు చెందిన రమ్యప్రియ

హైదరాబాద్, వెలుగుపంట సాగు నుంచి కోతల వరకు రైతులకు వివిధ రకాల అగ్రికల్చర్ మెషిన్లు అవసరం. చాలామంది రైతులు వాటిని అద్దెకు తీసుకుని ఉపయోగిస్తుంటారు. అయితే పంటకోతల టైమ్ లో మెషిన్లు దొరక్క, ఎక్కడ అందుబాటులో ఉంటాయో తెలియక రైతులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సికింద్రాబాద్ కు చెందిన రమ్య ప్రియ యాప్ తయారు చేసింది. దానికి రామసేతు అని పేరు పెట్టింది.

లాక్ డౌన్ లో పుట్టిన ఆలోచన..

చెన్నైలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన రమ్య ప్రియ.. ఆటోమొబైల్ ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ తో ఢిల్లీలోని ఓ సంస్థలో వెహికల్ మోడిఫికేషన్ లో డిప్లొమా చేశారు. 2017 నుంచి ఆటోమొబైల్స్ లో డిఫరెంట్ గా ఇన్నోవేషన్స్ చేయడం ప్రారంభించింది. అలా 2019లో ఎలక్ట్రిక్ పెడల్ బైక్ రూపొందించింది. గత ఫిబ్రవరిలో పెట్రోల్, బ్యాటరీతో నడిచే హైబ్రిడ్ బైక్ ను లాంచ్ చేసింది.  లాక్ డౌన్ లో రైతుల కష్టాలు చూసిన రమ్య వారికోసం ఏదైనా చేయాలని అనుకుంది. ఏప్రిల్ నుంచి జులై వరకు 7, 8 జిల్లాలు తిరిగి రైతుల సమస్యలపై రీసెర్చ్ చేసింది. పంటకోత మెషిన్ల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించింది.  వారి సమస్యలను తీర్చేందుకు రామసేతు యాప్ ను తయారు చేసింది. ఇందులో హార్వెస్టర్స్, సీడ్  డ్రిల్ మెషిన్స్, మొబైల్ రైస్ మిల్లర్స్ వంటి పలు అగ్రికల్చర్ మెషినరీలను అద్దెకు ప్రొవైడ్ చేసే వారి వివరాలు పొందుపరిచింది. రైతుల ఊర్లకు చుట్టుపక్కల ఉన్న మెషినరీల ఓనర్లు, ఫర్టిలైజర్స్ తో పాటు రైతులు కూడా తమ అకౌంట్స్ ను ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చని రమ్య ప్రియ తెలిపారు.

జనవరి నుంచి అందుబాటులోకి..

యాప్ జనవరి నుంచి అందుబాటులోకి వస్తుంది. అగ్రికల్చర్ మెషిన్స్ అద్దెకు ఇచ్చేవారి వివరాలు ఇందులో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మెషినరీ కూడా కొనుగోలు చేయవచ్చు. ఫ్రాంచైజీలు కూడా తీసుకోవచ్చు. వెహికల్స్ లో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు పేర్లను రిజిస్టర్ చేసుకుంటే ట్రైనింగ్ ఇస్తాం. త్వరలో కరీంనగర్ లోని జమ్మికుంట, పెద్దపల్లిలో 3 మొబైల్ రైస్ మిల్లర్స్, 2 హార్వెస్టర్లను లాంచ్ చేస్తాం.

– సీహెచ్ రమ్య ప్రియ