- ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి
వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో వచ్చే 15 ఏండ్ల వరకు రిపేరు రాకుండా రోడ్లు నిర్మిస్తామని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తికి వచ్చిన ఆయన రూ.359కోట్లతో చేపట్టే రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజీవ్‌చౌక్‌లో కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ 2028 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రూ.3వేల కోట్లతో అద్దాల్లాంటి రోడ్లు వేస్తామన్నారు. గ్రామ గ్రామాన రోడ్లు బాగున్నప్పుడే పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రోడ్లు వేయడమే కాకుండా రెగ్యులర్‌గా పర్యవేక్షిస్తామన్నారు. ఏడాదికొకసారి కూడా ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని వ్యక్తి తిరిగి సీఎం ఎలా అవుతాడని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్‌రెడ్డి అహర్నిశలు ప్రజాసేవ కోసం పనిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే సీఎం అవుతారన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ అహంకారానికి చెక్ పెట్టి గత ఎన్నికల్లో మేఘారెడ్డిని గెలిపించారని, అయినా గత పాలకులకు ఇంకా అహం తగ్గలేదన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో అసలు త్యాగం చేసింది జూపల్లి, కోమటిరెడ్డేనన్నారు. మీటింగ్‌లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్పాల్గొన్నారు.
