కర్నాటక సీఎం ఎంపికలో గందరగోళం.. ఫైనల్ కాలేదన్న సూర్జేవాలా

కర్నాటక సీఎం ఎంపికలో గందరగోళం.. ఫైనల్ కాలేదన్న సూర్జేవాలా

కర్ణాటక సీఎం సిద్దరామయ్య అంటూ వచ్చిన వార్తలు, కాంగ్రెస్ పార్టీ సోర్స్ పై.. ఆ పార్టీ అధిష్టానం యూటర్న్ తీసుకుంది. సీఎం ఎవరు అనే విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని.. ఫైనల్ కాలేదని.. దానికి ఇంకా 48 గంటల సమయం పట్టొచ్చు అంటూ ఆ పార్టీ కీలక నేత సూర్జేవాలా ప్రకటించారు. చర్చలు ఇంకా జరుగుతున్నాయని వెల్లడించిన ఆయన.. కర్ణాటక సీఎం ఎవరు అనేది నిర్ణయించిన తర్వాత స్వయంగా ప్రకటిస్తామని వెల్లడించారు. 

మే 17వ తేదీ బుధవారం ఉదయం జాతీయ మీడియాతోపాటు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని.. మే 18వ తేదీన బెంగళూరులో సీఎల్పీ భేటీ ఉంటుందని.. ఆ వెంటనే కంఠీవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం అనే వార్తలు వచ్చాయి. సిద్ధరామయ్య మద్దతు దారులు,  కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని.. బాణాసంచా కాల్చారు. సిద్ధరామయ్య ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సెక్యూరిటీ పెంచారు. ఈ పరిణామాలు అన్నీ కూడా సిద్ధరామయ్య సీఎం అని డిసైడ్ చేశాయి. 

అనూహ్య పరిణామాల మధ్య.. ఈ వార్తలు వచ్చిన మూడు గంటల సమయం తర్వాత.. తీరిగ్గా స్పందించారు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రతినిధి సూర్జేవాలా. కర్ణాటక సీఎం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదంటూ కామెంట్ చేశారు. దీంతో కథ మొదటికి రావటం ఏంటో కానీ.. అందరూ గందరగోళంలో పడ్డారు.