- రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు : ప్రతి ఓటరు తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. మంగళవారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని కలెక్టరేట్లో పోలింగ్ ప్రక్రియ, ప్రత్యేక వసతులపై వయో వృద్ధులకు అవగాహన కల్పించి సన్మానించారు. ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల పనితీరుపై వివరించి అనుమానాలను నివృత్తి చేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. 80 ఏండ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించిందని వివరించారు.
ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం నిర్ణీత ఫారం నింపి తెలియజేస్తే, పోలింగ్ అధికారి నేతృత్వంలోని సిబ్బంది వెళ్లి సీక్రెట్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, స్వీప్ నోడల్ అధికారి ప్రభాకర్, ఎన్నికల విభాగం అధికారి సైదులు, సంబంధిత అధికారులు, వయోవృద్ధులు పాల్గొన్నారు.