అరుదైన ఘనత దక్కించుకున్న రణ్ వీర్ సింగ్

అరుదైన ఘనత దక్కించుకున్న రణ్ వీర్ సింగ్

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రణ్ వీర్ సింగ్ ఓ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. నార్త్ ఆఫ్రికా మొరాకోలో జరిగిన మర్రకేచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ ఏడాదికి గానూ 19వ ఎడిషన్‌లోని ఎటోయిల్ డి’ఓర్ అవార్డును రణ్ వీర్ అందుకున్నారు. దాంతో పాటు రణ్ వీర్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిన బాజీరావ్ మస్తానీ చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రముఖ సినీ దిగ్గజాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనగా.. అవార్డు స్వీకరించిన అనంతరం రణ్ వీర్ డ్యాన్స్ చేశాడు. దాంతో పాటు తన మాటలను ర్యాప్ రూపంలో చెప్పి, అందర్నీ ఆకట్టుకున్నాడు. 

గతంలో ఈ బిరుదుని భారత్ తరుపు నుంచి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్,అమీర్ ఖాన్ లు అందుకున్నారు. ఇక రణ్ వీర్ సినిమా విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన ‘సర్కస్’ సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రణవీర్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో దీపికా పడుకోణె, అజయ్ దేవగన్ గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు.