బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ , దర్శకుడు ఆదిత్యథర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ' దురంధర్'. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో దూసుకెళ్లింది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది. ఈ స్పై థ్రిల్లర్ విడుదలైన నెల రోజులు గడిచినా, థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
బాక్సాఫీస్ లెక్కలు తిరగరాస్తూ..
2025 డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్'.. బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను తిరగరాస్తోంది. ఆదిత్యధర్ అద్భుతమైన మేకింగ్, రణవీర్ సింగ్ ఎనర్జీ తోడవ్వడంతో ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇండియాలో ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 829.40 కోట్లు వసూలు చేసింది. 2025లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. పుష్ప2, బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది.
ఓటీటీలో గ్రాండ్ ఎంట్రీ!
నిజానికి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, క్రిస్మస్ సీజన్‌లో దక్షిణాదిలో భారీ సినిమాలు లైన్‌లో ఉండటంతో థియేటర్ల కొరత ఏర్పడింది. దీంతో హిందీలో నే రిలీజ్ చేశారు. ఇప్పుడు నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. 'ధురంధర్' డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే మొత్తానికి దక్కించుకుంది. ఈ చిత్రం జనవరి 30, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. కేవలం ఈ ఒక్క సినిమాకే కాకుండా, దీనికి సీక్వెల్‌గా రాబోతున్న 'ధురంధర్ 2' హక్కులను కూడా కలిపి నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ. 130 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది అత్యంత లాభదాయకమైన ఓటీటీ ఒప్పందంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో కేవలం రణవీర్ సింగ్ మాత్రమే కాకుండా అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు నటించడంతో సినిమాపై హైప్ మొదటి నుంచీ భారీగా ఉంది . ది సర్జికల్ స్ట్రైక్' తర్వాత ఆదిత్య ధర్ తెరకెక్కించిన చిత్రం కావడంతో ఇందులో యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. స్పై థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడే వారికి, అలాగే రణవీర్ సింగ్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌ను అమితంగా ఇష్టపడే ప్రేక్షకులకు 'ధురంధర్' ఒక విందు లాంటిది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు జనవరి 30 కోసం సిద్ధంగా ఉండండి. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ కానుంది.
