వైభవంగా వైకుంఠ రాముని రాపత్ ఉత్సవం

వైభవంగా వైకుంఠ రాముని రాపత్ ఉత్సవం

భద్రాచలం, వెలుగు :  ఏరియా ఆస్పత్రి సమీపంలోని దసరా మండపంలో శుక్రవారం వైకుంఠ రామునికి రాపత్​ ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామిని ఊరేగింపుగా దసరా మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోలాటాలు, రామనామ స్మరణలు మధ్య స్వామికి స్వాగతం పలికారు. వేదపారాయణాలు చేశాక విశేష హారతులు సమర్పించారు. అంతకుముందు ఉదయం సీతారామచంద్రస్వామికి సుప్రభాత సేవ చేసి మూలవరులను బంగారు కవచాలతో అలంకరణ చేశారు. బేడా మండపంలో స్వామికి అధ్యయన పారాయణం చేశాక నిత్య కల్యాణం జరిగింది. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు.

లక్ష్మీ అష్టోత్తరశతనామార్చన, కుంకుమార్చన, విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం అలంకణల తర్వాత రాపత్​ సేవకు దసరా మండపానికి ఊరేగింపుగా చేసుకుని పూజలందుకుని తర్వాత తిరువీధి సేవగా ఆలయానికి వెళ్లారు. ఈనెల 23నుంచి 27 వరకు భక్తరామదాసు 393వ జయంతిని పురస్కరించుకుని వాగ్గేయకారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో దామోదర్​రావు ప్రకటించారు. ఏఈవోలు శ్రావణ్​కుమార్​, భవానీరామకృష్ణలతో కలిసి పాంప్లెట్స్​ను ఆయన ఆవిష్కరించారు.

దేశం నలుమూల నుంచి సంగీత కళాకారులు వచ్చి భక్తరామదాసుకు స్వరనీరాజనం పలుకుతారని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల సూచనల మేరకు ఇకపై ప్రతీ ఆదివారం ఏరు ఉత్సవంలో భాగంగా గోదావరికి నదీహారతిని ఇస్తున్నట్లు కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​ తెలిపారు. ఈనెల 11న ఆదివారం జరిగే నదీహారతికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.