
- తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి చేశామన్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: సోమాజీగూడ యశోద హాస్పిటల్ డాక్టర్లు తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా త్రీడీ ప్రింటెడ్ టైటానియం టోటల్ టాలస్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. చీలమండ(పాదం, కాలి మధ్య జాయింట్) సర్జరీకి సంబంధించిన వివరాలను సోమాజిగూడలోని ఆర్థోపెడిక్ విభాగం సీనియర్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి గురువారం వివరించారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల పంకజ్ గతేడాది ప్రమాదవశాత్తు జారిపడడంతో కుడి కాలు చీలమండకు తీవ్ర గాయమైంది. చీలమండ ఎముకకు రక్త ప్రసరణ ఆగిపోయి ఎముక కుళ్లిపోయింది. గత నెలలో యశోదలో చేరగా కస్టమ్ -మేడ్ త్రీడీ ప్రింటెడ్ టైటానియం టాలస్ ఎముకను రూపొందించాలని నిర్ణయించారు.
టైటానియంతో అత్యాధునిక 3డీ టెక్నాలజీ సాయంతో కొత్త టాలస్ ఎముకను తయారుచేసి సర్జరీ ద్వారా అమర్చారు. ఇప్పుడు పంకజ్ నొప్పి లేకుండా నడవగలుగుతున్నాడని డాక్టర్ సునీల్ దాచేపల్లి తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ తెలుగురాష్ట్రాల్లోనే తొలిసారి అని యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నారు.