గుండెలో రంధ్రాన్ని పూడ్చిన డాక్టర్లు

గుండెలో రంధ్రాన్ని పూడ్చిన డాక్టర్లు
  • ప్రతిమా హాస్పిటల్స్​లో బాలికకు అరుదైన చికిత్స
  • గుండెలో రంధ్రాన్ని పూడ్చిన డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: మహబూబ్ నగర్​కు చెందిన  14 ఏండ్ల గౌరీకి పుట్టుకతోనే గుండె సహా కుడి వైపు అవయవాలు ఎడమకు, ఎడమ వైపు అవవయాలు కుడివైపు ఉన్నాయి. దీంతో పాటు ఆమెకు గుండెలో రంధ్రం ఏర్పడి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరిగా అందక ఇబ్బంది పడేది. దీంతో గౌరీని గత నెల కాచిగూడలోని ప్రతిమా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అడ్మిట్ చేశారు. పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్ డా. వివేక్ బాబు బొజ్జవార్ బాలికను పరీక్షించారు. ఆయన ఆధ్వర్యంలోని అనస్థిషియా డాక్టర్ అమర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్, పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రణీత్ రెడ్డి గత ఆగస్ట్ 29న గౌరీకి హార్ట్, లంగ్ మెషీన్ సాయంతో ఇంట్రా కార్డియాక్ రిపేర్ సర్జరీని నిర్వహించారు.

దాదాపు 8 గంటల పాటు సర్జరీ చేసి గుండెలో రంధ్రాన్ని పూడ్చి ఊపిరితిత్తులకు రక్త సరఫరాను మెరుగుపరిచారు. సర్జరీ అనంతరం మూడ్రోజుల పాటు ఐసీయూలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. తర్వాత గౌరీ ఆరోగ్యం మెరుగుపడిందని  డాక్టర్ వివేక్ బాబు తెలిపారు. 50 వేల మందిలో ఒకరు ఇలా పుడతారని, 10 లక్షల్లో ఒకరు ఇలాంటి సమస్యతో బాధపడతారని డాక్టర్ వివేక్ తెలిపారు. సర్జరీ తర్వాత గౌరీ పూర్తిగా కోలుకుందని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. మరో 6 నెలల పాటు మందులు వాడాల్సి ఉంటుందన్నారు. గౌరీని శుక్రవారం డిశ్చార్జి చేశామన్నారు. ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు చేయడంలో ప్రతిమ హాస్పిటల్ ఎప్పుడూ ముందుంటుందని హాస్పిటల్స్ డైరెక్టర్ డా. ప్రతీక్ బోయినిపల్లి తెలిపారు. కార్యక్రమంలో సీవోవో డాక్టర్ అజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.