Rashid Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన రిటైర్మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగుతో విజయం సాధించిన తర్వాత రషీద్ ఖాన్ తన భవిష్యత్తు ప్లాన్ గురించి మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. గత కొంతకాలంగా తాను దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు పేర్కొన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ అనంతరం సర్జరీ కూడా చేయించుకున్నా.. ఆపరేషన్ తర్వాత మళ్లీ గ్రౌండ్ లోకి తిరిగి వచ్చినప్పటికీ.. టెస్ట్ క్రికెట్ ఆడటం వల్ల వెన్నుపై ఎక్కువగా భారం పడుతోందని రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడంతో తన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించినట్లు రషీద్ వెల్లడించాడు.
డాక్టర్ల సూచన మేరకే:
డాక్టర్ల సలహాను పట్టించుకోకుండా గతంలో జింబాబ్వేతో జరిగిన టెస్టులో 67 ఓవర్లు బౌలింగ్ చేశా.. అది తన వెన్నుముక్కపై తీవ్ర ప్రభావం చూపిందని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. నువ్వు ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలనుకుంటే రెడ్ బాల్ (టెస్ట్) క్రికెట్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు స్పష్టంగా చెప్పినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. అందుకే తన కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగించేందుకు పరిమిత (వన్డేలు, టీ20లు) ఓవర్ల క్రికెట్ పైనే పూర్తిస్థాయి దృష్టి పెట్టినట్లు రషీద్ ఖాన్ తెలిపాడు.
ALSO READ : KKR vs LSG మ్యాచ్ పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!
భారత్‌తో జరిగే టెస్ట్ కి దూరం:
ఆఫ్ఘనిస్తాన్ జట్టు టెస్ట్ హోదా పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడిన 12 టెస్టుల్లో రషీద్ ఖాన్ కేవలం 6 మ్యాచ్‌లని మాత్రమే ఆడాడు.. 2026 జూన్‌లో భారత్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఈ ఏడాది ఓ టెస్ట్ మ్యాచ్ అయితే ఆడగలనేమో కానీ.. అంతకంటే ఎక్కువ భారాన్ని తన శరీరం మోయలేదని రషీద్ ఖాన్ ఇప్పటికే స్పష్టం చేశాడు. మొత్తానికి వైట్ బాల్ క్రికెట్లో మరిన్ని విజయాలు సాధించడమే తన టార్గెట్ అని ప్రకటించాడు.
