గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకల్లో భాగంగా ఇండియా నిర్వహించనున్న సాంస్కృతిక ప్రదర్శనకు సినీ నటి రష్మిక మందాన, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
దాదాపు 20 నిమిషాల పాటు వీళ్ల పెర్ఫామెన్స్ జరగనుంది. భారతీయ విశిష్ట సంస్కృతి సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా సంగీతం, నృత్య రూపకాలతో ప్రదర్శనలను ఇవ్వనున్నారు. ఆగస్టు 2న జరగనున్న ఈ కార్యక్రమంలో 2030 శతాబ్ది కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య దేశంగా ఇండియా (అహ్మదాబాద్) అధికారికంగా కామన్వెల్త్ పతాకాన్ని స్వీకరించనుంది.
ఈ చారిత్రక ఘట్టానికి ప్రధాని నరేంద్ర మోదీ హజరయ్యే అవకాశం ఉంది. 2010లో న్యూఢిల్లీలో నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఇండియా ఈ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుండటం రెండోసారి. ప్రసిద్ధ గ్లాస్గో రాక్ బ్యాండ్ 'సింపుల్ మైండ్స్' తమ సంగీత కచేరీతో ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలకు ఘనంగా వీడ్కోలు పలకనుంది.
