
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. నలుగురు ఉన్నతాధికారులతో రెండు కమిటీలను నియమించి, కమిటీల సిఫారసులు అమలయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే.. జూన్ 1 నుంచి అర్హులకు రేషన్ కార్డులను జారీ చేయాలని అధికారులను ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశించారు. ఇప్పటికే అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఏడు రోజుల్లో కార్డులను అందించాలన్నారు.
రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే స్కాన్‌చేసి అప్లోడ్ చేయాలని, కుటుంబ సభ్యుల వేలిముద్రలను తీసుకోవాలని మీ సేవ, ఈ సేవ కేంద్రాల ఆపరేటర్లకు సూచించారు. పెండింగ్దరఖాస్తులు ఎక్కువగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో చీఫ్రేషనింగ్ ఆఫీసు నుంచి సీనియర్ చెకింగ్ఆఫీసర్లను, ఎంక్వైరీ ఆఫీసర్లను నియమించి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అకున్ సబర్వాల్ ఆదేశించారు.