IPL 2026: తప్పించారా.. తప్పుకున్నాడా: చెన్నైకు అశ్విన్ చెక్.. ఆక్షన్‌లోకి వెటరన్ స్పిన్నర్

IPL 2026: తప్పించారా.. తప్పుకున్నాడా:  చెన్నైకు అశ్విన్ చెక్.. ఆక్షన్‌లోకి వెటరన్ స్పిన్నర్

టీమిండియా వెటరన్ స్పిన్నర్  రవిచంద్రన్ అశ్విన్ ఊహించని నిర్ణయం తీసుకొని షాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2026 లో ఈ వెటరన్ స్పిన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నుంచి విడిపోయే అవకాశం ఉన్నట్టు సమాచారం. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. 38 ఏళ్ల అశ్విన్.. జట్టు నుంచి విడిపోవాలనే తన నిర్ణయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కు తెలిజేశాడట. జట్టు నుంచి విడిపోవడానికి గల ఖచ్చితమైన కారణం మాత్రం తెలియాల్సి ఉంది. అశ్విన్ నిర్ణయంతో  సూపర్ కింగ్స్ సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 9 ఏళ్ళ తర్వాత లోకల్ జట్టుకు వచ్చిన అశ్విన్.. ఒక్క సీజన్ తోనే జట్టు నుంచి తప్పుకోవాలనే నిర్ణయం కాస్త షాకింగ్ గా మారుతుంది. 

38 ఏళ్ల అశ్విన్ పదేళ్ల విరామం తర్వాత 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. ఎన్నో అంచనాలతో మెగా ఆక్షన్ లోకి అడుగుపెట్టిన అశ్విన్ ను చెన్నై రూ. 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. లోకల్ ప్లేయర్ కావడంతో ఈ వెటరన్ స్పిన్నర్ పై సీఎస్కె యాజమాన్యం ఎన్నో అంచనాలు పెట్టుకుంది. అయితే ఐపీఎల్ 2025లో అశ్విన్ ఘోరంగా విఫలమయ్యాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడి 9.13 ఎకానమీ రేటుతో ఏడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ రాణించింది లేదు. దీంతో అశ్విన్ తనకు తానుగా చెన్నై జట్టుతో విడిపోయినట్టుగా తెలుస్తోంది. 

►ALSO READ | Ashes 2025: ఇంగ్లాండ్ జట్టును తీసి పడేసిన ఆసీస్ దిగ్గజం.. యాషెస్ జోస్యం చెప్పిన మెగ్రాత్

అశ్విన్ ఐపీఎల్ ప్రయాణం చెన్నై సూపర్ కింగ్స్‌తో ప్రారంభమైంది. 2009 నుండి 2015 వరకు ఆరు సీజన్లు  సీఎస్కె జట్టు తరపున  ఆడాడు. 2016 నుంచి 2024 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. 2025లో చెన్నై జట్టులోకి వచ్చాడు. అశ్విన్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే 220 మ్యాచ్‌ల్లో 7.29 ఎకానమీ రేటుతో 187 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లోనూ సత్తా చాటి 118 స్ట్రైక్ రేట్‌తో 833 పరుగులు చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు సాధించడంలో విఫలమైంది.