మామ ఆరోపణలు.. భర్త ప్రశంసలు.. మరోసారి వార్తల్లో రివాబా

 మామ ఆరోపణలు..  భర్త ప్రశంసలు.. మరోసారి వార్తల్లో రివాబా

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా  తన భార్య రివాబాపై ప్రశంసలు కురిపించాడు.  రాజ్‌కోట్ టెస్ట్ లో ప్రదర్శనకు గానూ అందుకున్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తన భార్యకు అంకితం ఇచ్చాడు.  ఇంగ్లండ్‌తో జరిగిన 3వ టెస్టులో భారత్ 434 పరుగులతో రికార్డు విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్ లో  సెంచరీతో పాటుగా  సెకండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు.  దీంతో  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా..   ఈ  అవార్డును తన భార్యకు అంకితం ఇస్తున్నట్లుగా వెల్లడించాడు.  

మొదటి ఇన్నింగ్స్ లో  సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఒక ప్రత్యేక అనుభూతి.  ఇది నా హోమ్ గ్రౌండ్‌లో జరగడం  మరింత ప్రత్యేకం.  మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును నా భార్యకు అంకితం చేయాలనుకుంటున్నాను.ఆమె మానసికంగా తెరవెనుక చాలా కష్టపడుతుంది.  ఆమె ఎప్పుడూ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తూ ఉంటుంది అని జడేజా బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో తెలిపాడు.  

ఇటీవల జడేజా కుటుంబం వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.  పెండ్లయిన తర్వాత జడేజా తమ  కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఆయన తండ్రి అనిరుధ్‌‌‌‌సిన్హ్ జడేజా ఆరోపించారు. దీనికి జడ్డూ భార్య రివాబానే కారణమని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.  కొడుకు  దూరం కావడంతో తాను ఒంటరిగా ఉంటున్నానని, చనిపోయిన భార్య పేరిట వచ్చే రూ. 20 వేల పెన్షన్‌‌‌‌పైనే ఆధారపడుతున్నానని తెలిపాడు. అక్కతో కూడా జడేజాకు సత్సంబంధాలు లేవన్నాడు. 

అయితే, తండ్రి ఆరోపణలను జడేజా ఖండించాడు. ఆయన చెప్పిన విషయాలన్నీ అర్థరహితమైనవి, అవాస్తవమైనవి. ఈ ఆరోపణలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఇవి నా భార్య ప్రతిష్టను దిగజార్చడానికి చేసిన ప్రయత్నాలు అని కొట్టివేశాడు.