ఐపీఎల్ 2026కి ముందు రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ట్రేడింగ్ చేసుకుంది. శాంసన్ చెన్నై జట్టులోకి వస్తే ట్రేడింగ్ ద్వారా వారు జడేజాతో పాటు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ను రాజస్థాన్ కు ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. జడేజా చెన్నై జట్టులోకి రావడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. రాజస్థాన్ జట్టులోకి రావాలంటే జడేజా తనకు కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ చేసినట్టు సమాచారం. ట్రేడింగ్ తర్వాత తనకు రాజస్థాన్ కెప్టెన్సీ ఇవ్వాలని చెప్పాడట.
క్రికెట్ నెక్స్ట్ నివేదిక ప్రకారం.. 37 ఏళ్ల జడేజా తన ఐపీఎల్ కెరీర్ చివరి దశలో ఫ్రాంచైజీని నడిపించాలనే కోరికను వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ లాంటి యంగ్ ప్లేయర్లను భవిష్యత్ కెప్టెన్లుగా పరిగణించిన రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు జడేజా డిమాండ్‌తో ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అతని అనుభవం, కెప్టెన్సీ స్కిల్స్ కారణంగా జడేజాకు రాజస్థాన్ జట్టు పగ్గాలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కానీ ట్రేడ్ ఖరారు అయిన తర్వాత మాత్రమే అధికారిక నిర్ణయం తీసుకోబడుతుంది.
జడేజాకు గతంలో ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవం ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ గా చేశాడు. ఈ సీజన్ లో జడేజా కెప్టెన్ గా ఫెయిలయ్యాడు. అతని సారధ్యంలో చెన్నై ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో జడేజాను CSK కెప్టెన్ నుంచి తప్పించి ధోనీ మళ్లీ పగ్గాలు చేపట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్ కు ధోనీ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో జడేజాకు చెన్నై కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదని ఫ్రాంఛైకీ స్పష్టంగా చెప్పింది. మరి ఇప్పుడు జడేజాను నమ్మి రాజస్థాన్ అతడికి కెప్టెన్సీ ఇస్తుందో లేదో చూడాలి.
జడేజా ఇప్పటివరకు 254 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ తర్వాత అత్యధిక మ్యాచ్ లాడిన ఐదో ప్లేయర్ గా నిలిచాడు. 143 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా జడేజాని కావడం విశేషం. 16 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను సాధించాడు. ధోనీతో పాటు అత్యధిక ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్ అవార్డులు (16) కూడా జడేజా సొంతం. 2022లో జడేజాను చెన్నై కెప్టెన్ గా నియమించిన జట్టు ఘోరంగా ఆడడంతో మళ్ళీ ధోనీనే సారధిగా నియమించింది.
19 ఏళ్ల వయసులో జడేజా ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి జట్టు ఆర్ఆర్. 2008లో అతను టైటిల్ గెలుచుకున్న తొలి జట్టు కూడా అదే. జడేజా మొదటి రెండు సీజన్లలో ఆర్ఆర్ తరఫున ఆడాడు. 2010లో ముంబై ఇండియన్స్‌తో నేరుగా ఒప్పందంపై చర్చలు జరపడానికి ప్రయత్నించినందుకు ఐపీఎల్ అతనిని సస్పెండ్ చేసింది. నిషేధం తర్వాత జడేజా 2011లో కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. 2012లో CSK 2 మిలియన్లకు కొనుగోలు చేసింది.
