
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ ఎటాక్ జరిగింది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సిన సమయంలో జరిగిన ఈ డ్రోన్ దాడిలో స్టేడియంలోని కొంత భాగం డ్యామేజ్ అయ్యింది. ప్రస్తుతం పాకిస్తాన్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) జరుగుతోంది. పీఎస్ఎల్ షెడ్యూల్ ప్రకారం.. గురువారం (మే 8) రాత్రి 8 గంటలకు రావల్పిండి స్టేడియంలో పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
ఇందులో భాగంగా మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కావల్సి ఉండగా.. ఇంతలోనే రావల్పిండి స్టేడియంపై డ్రోన్ దాడి జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ దాడి జరగడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన పీఎస్ఎల్ నిర్వాహకులు.. లీగ్ షెడ్యూల్ మార్చారు. మిగిలిన పీఎస్ఎల్ అన్ని మ్యాచులను కరాచీకి తరలించారు. కాగా, పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది.
►ALSO READ | IPLపై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మే 11న జరగనున్న పంజాబ్, ముంబై మ్యాచ్ వేదిక మార్పు
భారత వైమానిక దళ మెరుపు దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు ఖతం అయ్యారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆగ్రహంగా ఉన్న పాక్.. ఈ ఆపరేషన్ తర్వాత భారతదేశంలోని 15 సైనిక లక్ష్యాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టిన భారత్.. దాయాది దేశంలోని ప్రధాన నగరాలపై కౌంటర్ ఎటాక్ చేసింది. ఈ నేపథ్యంలోనే రావల్పిండి స్టేడియంపై డ్రోన్ ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది.