టాప్​ 20 కార్పొరేట్లపై పెరిగిన ఆర్​బీఐ నిఘా

టాప్​ 20 కార్పొరేట్లపై పెరిగిన ఆర్​బీఐ నిఘా

అప్పులు-వడ్డీలు కట్టడంలో ఒత్తిడి తెలుసుకోవడం కోసమే

కార్పొరేట్ల ఎఫెక్ట్​ బ్యాంకులపై పడకుండా ముందు జాగ్రత్తలు

ముంబై : దేశ–విదేశాల నుంచి భారీగా అప్పులు తీసుకున్న  20 పెద్ద బిజినెస్​ హౌస్​(కార్పొరేట్​గ్రూప్)లను రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) జాగ్రత్తగా గమనిస్తోంది. ఏవైనా రిస్క్​లు ఎదురయ్యే సూచనలుంటే, ముందుగానే గుర్తించడం కోసమే గతంలో కంటే నిఘాను కొంత పెంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్​ ఫైనాన్షియల్​ ఇంటర్మీడియరీలు, సెంట్రల్​ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్​ ఆన్​ లార్జ్​ క్రెడిట్స్​ (సీఆర్​ఐఎల్​సీ)లను ఆర్​బీఐ రొటీన్​గానే మానిటర్​ చేస్తుంటుంది.

మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిఘాను మరికొంత పెంచినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా గ్రూప్​లు వాటికి సంబంధించిన కంపెనీల లాభదాయకత, ఫైనాన్షియల్​ పెర్​ఫార్మెన్స్​ వంటి అంశాలను ఆర్​బీఐ మానిటర్​ చేస్తోంది. అంతేకాదు, ఈ గ్రూప్​లు అప్పుల రూపంలో ఎంత సేకరించాయి, అందులో ఎక్స్​టర్నల్​ కమర్షియల్​ బారోయింగ్స్​  లేదా బాండ్స్​ ఉన్నాయా? అనే దానిని  పరిశీలిస్తోంది. అదేవిధంగా, అప్పులు–వాటిపై వడ్డీలను చెల్లించడంలో ఆయా గ్రూప్​లు ఏవైనా ఇబ్బందులు పడుతున్నాయా.. అనే అంశాన్ని కూడా గమనిస్తోంది.

ఒత్తిడి ఎదుర్కొంటున్న సూచనలను పసిగట్టేందుకు ఒక మానిటరింగ్​ సిస్టమ్​ను ఆర్​బీఐ ఏర్పాటు చేసుకుంది. పెద్ద కార్పొరేట్​ గ్రూప్​ల ఇబ్బందుల పర్యవసానంగా బ్యాంకుల బాలెన్స్​షీట్లు పాడవకుండా చూడాలనేదే ఆర్​బీఐ ప్రయత్నమని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. అప్పులు–వడ్డీలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్న సూచనలు కనబడితే పెద్ద ముప్పులు వాటిల్ల కుండా ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలనేదే ఆర్​బీఐ ఉద్దేశం.