రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించింది. వరుసగా రెండోసారి రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. గత ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆచితూచి అడుగు వేయాలని ఆర్బీఐ భావించింది. ఎంపీసీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచాలని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత నిర్ణయం ప్రకారం రెపో రేటు 5.25 శాతంగా ఉండగా.. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 5 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 5.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనున్నాయి. ఆర్బీఐ తన పాలసీ వైఖరిని 'న్యూట్రల్'గా కొనసాగిస్తోంది. దీనివల్ల అటు ఆర్థిక వృద్ధికి మద్దతునిస్తూనే, ఇటు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్త వహించింది. 2025 సంవత్సరంలో మొత్తం 125 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో కోత విధించిన ఆర్బీఐ.. ఇప్పుడు మాత్రం అప్రమత్తతకు ప్రాధాన్యత ఇస్తోంది.
ద్రవ్యోల్బణం అంశంపై గవర్నర్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.6 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ లో తలెత్తుతున్న ఆటంకాలు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. సరఫరాలో ఇబ్బందులు దీర్ఘకాలం కొనసాగితే.. అవి డిమాండ్-సైడ్ ఒత్తిళ్లకు దారితీస్తాయని, అందుకే నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాణిజ్య అనిశ్చితి వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా ముందస్తు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడానికి ఆర్బీఐ మూడు ప్రధాన చర్యలను ప్రకటించింది. బ్యాంకు బోర్డుల సమయాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, పర్యవేక్షణ సూచనలను సరళీకరించడం, ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి తగిన ప్రోత్సాహకాలు అందించడం వంటివి ఇందులో ఉన్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని, లిక్విడిటీ మేనేజ్‌మెంట్ పటిష్టంగా ఉందని గవర్నర్ భరోసా ఇచ్చారు. వ్యవస్థలో సగటున రూ. 2.3 లక్షల కోట్ల మిగులు డబ్బు నిల్వలు ఉన్నాయని, ఇవి ఉత్పాదక రంగాల అవసరాలకు సరిపోతుందని వివరించారు. ఈ మొత్తం పరిణామాలు భారత్ ప్రస్తుత ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటూనే స్థిరమైన వృద్ధి దిశగా వెళ్తోందని సూచిస్తున్నాయి.
