కాళేశ్వరంలో రీ డిజైనింగే అవినీతికి మొదటి అడుగు : నైనాల గోవర్ధన్

కాళేశ్వరంలో రీ డిజైనింగే అవినీతికి మొదటి అడుగు : నైనాల గోవర్ధన్
  •      అందులో భాగమైన అన్ని సంస్థలను విచారించాలి: నైనాల గోవర్ధన్

హైదరాబాద్, వెలుగు: జ్యుడీషియల్ కమిషన్లను బెదిరించేలా వ్యవహరిస్తున్న కేసీఆర్ రాచరిక పోకడలను ఖండించాలని తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జుడీషియల్​ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్​ను రాష్ట్ర ప్రభుత్వం మార్చాలన్నారు. రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ పేరిట తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరానికి మార్చడమే అవినీతికి మొదటి అడుగు అని గురువారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

 ‘‘రూ.28 వేల కోట్లతో 3వ టీఎంసీ అని సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండానే నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్ట్​ను మేఘా కంపెనీకి ఇవ్వడంపై కూడా ఎంక్వైరీ చేయాలి. మల్లన్న సాగర్ నిర్మాణంపై విచారణ జరగాలి. ఒక్క టీఎంసీ అని చెప్పి సగం టీఎంసీని కూడా ఎదురెక్కించలేక పోయిన రూ.2 వేల కోట్లతో చేపట్టిన శ్రీరాంసాగర్​ పునరుజ్జీవ ప్రాజెక్టుపైనా విచారణ జరిపించాలి. 

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్​ను మేఘా కంపెనీ పంపింగ్ వ్యవస్థలు, తప్పుల తడక డిజైన్లను ఆమోదించిన సీడబ్ల్యూసీపైనా ఎంక్వైరీ చేయాలి. కేంద్రంలోని వ్యాప్కోస్​నూ విచారణలో భాగం చేయాలి. మేఘా కంపెనీ ఇచ్చిన రూ.1186 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్​పై విచారణ జరిపించాలి’’ అని డిమాండ్ చేశారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు దీనిపై సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.