ఆ కోటిన్నర ఏమయ్యాయి?..కొండమడుగు పంచాయతీలో మరోసారి విచారణకు రెడీ   

ఆ కోటిన్నర ఏమయ్యాయి?..కొండమడుగు పంచాయతీలో మరోసారి విచారణకు రెడీ   

యాదాద్రి, వెలుగు: రూ. కోటిన్నర అవినీతి నిగ్గు తేల్చేందుకు జిల్లా యంత్రాంగం రెడీ అయింది. నాలుగేండ్లుగా బాధ్యతలు నిర్వర్తించిన వారందరికీ షోకాజ్ నోటీసులు రెడీ అయ్యాయి.  ఒకటి రెండ్రోజుల్లో వాటిని అందించి వివరణ కోరనున్నారు.  హైదరాబాద్​- వరంగల్​ హైవే పక్కనే  కొండమడుగు పంచాయతీ ఉంది.  హైదరాబాద్​కు దగ్గరగా ఉండడం వల్ల ఈ గ్రామం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

 డెవలప్​మెంట్​ స్థాయిలోనే ఈ పంచాయతీలో అవినీతి చోటు చేసుకుంది.  ఈ పంచాయతీలో చోటు చేసుకున్న అవినీతిపై గతేడాదిలోనే  అడిషనల్ కలెక్టర్​కు ఫిర్యాదు అందింది.  దీంతో అప్పట్లోనే డీఎల్​పీవో విచారణ నిర్వహించి, రిపోర్ట్​ అందించారు.  ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆ రిపోర్ట్ పక్కకు వెళ్లింది.  అనంతరం పంచాయతీ సెక్రెటరీ అలివేలుపై సస్పెన్షన్​ వేటు పడింది.

ఈ పంచాయతీలో జరిగిన అవినీతిపై ఇటీవల మరోసారి విచారణ నిర్వహించారు.  2021 నుంచి 2025 వరకూ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన రికార్డులను ఆఫీసర్లు పరిశీలించారు. ఈ పరిశీలనలో అవినీతి జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలోని ఒక్క షాపునకు రూ. 75 లక్షలు చెల్లించినట్టు రికార్డుల్లో పేర్కొన్నారు.  వస్తువుల కొనుగోలు పేరుతో మరో రూ. 75 లక్షల వరకూ ఖర్చు చేశారు.

దీనికి సంబంధించి  కార్మికులకు డబ్బు చెల్లించినట్టుగా రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా రూ. 1.50 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా రికార్డుల్లో పేర్కొన్నారు. వివిధ పనులు చేపట్టినట్టు రికార్డుల్లో ఉన్నా ఎక్కడా ఎంబీలు లేవు. దీంతో 2021 నుంచి 2025 వరకూ బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి ఒక్కరికీ షోకాజ్​ నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సర్పంచ్​, ఉప సర్పంచ్​, సెక్రెటరీలు, ఎంపీవో, డీఎల్​పీవో, ఇన్​చార్జ్​లకు కూడా ఇవ్వడానికి షోకాజ్​ నోటీసులు రెడీ చేశారు. రెండ్రోజుల్లో అందరికీ నోటీసులు సర్వ్​ చేయనున్నట్టు ఆఫీసర్లు తెలిపారు.