దళారులకు చెక్: హెడ్డాఫీసు నుంచే ఆర్టీఏ స్మార్ట్ కార్డులు..జోనల్ ఆఫీసుల నుంచి  మార్చే అవకాశం  

దళారులకు చెక్: హెడ్డాఫీసు నుంచే ఆర్టీఏ స్మార్ట్ కార్డులు..జోనల్ ఆఫీసుల నుంచి  మార్చే అవకాశం  
  • దళారులు, పోస్టల్​ డిలే, ప్రింటింగ్​ ఆలస్యమే కారణం

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్​లో ఆర్టీఏ ఇస్తున్న స్మార్ట్​కార్డులను ఇక నుంచి ఖైరతాబాద్​లోని హెడ్డాఫీసు నుంచే జారీ చేసేందుకు అధికారులు ప్రపోజల్స్​రెడీ చేశారు. డ్రైవింగ్​లైసెన్సులు, వాహనాల డాక్యుమెంట్లు, ఆర్సీ బుక్​వంటివన్నీ ప్రస్తుతం జోనల్​ఆర్టీఏ ఆఫీసుల నుంచే ఇస్తున్నారు.

గతంలో అప్లై చేసుకున్న తర్వాత స్మార్ట్​కార్డులు డైరెక్ట్​వాహనదారులకే ఇచ్చేవారు. బ్రోకర్ల సమస్య ఉండడంతో స్పీడ్​పోస్టు ద్వారా డెలివరీ చేయడం మొదలుపెట్టారు. అయినా దళారుల దందా ఆగకపోవడం, రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారం రోజుల్లో చేరాల్సిన కార్డులు నెల పడుతుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. కార్డులు రావడం లేదని చాలామంది డూప్లికేట్​కార్డుల కోసం ఆఫీసులకే వస్తున్నారు. దీంతో రూల్స్​మార్చబోతున్నట్టు సమాచారం.  

దళారులదే హవా

గ్రేటర్​పరిధిలోని ఆరు జోనల్​ఆఫీసుల నుంచి రోజుకు 5 వేల నుంచి 6 వేల కార్డులు జారీ అవుతున్నాయి. ఆన్​లైన్​తో పాటు ఆఫ్​లైన్​రిజిస్ట్రేషన్​టైంలోనే అన్ని రకాల ఫీజులు, సర్వీస్​ఛార్జీతో పాటు పోస్టల్​ఫీజు కూడా తీసుకుంటున్నారు. కానీ ఇన్​టైంలో వాహనదారులకు కార్డులు చేరడం లేదు. దీని వెనక కూడా దళారులు ఉంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో అధికారులు అండతో స్పీడ్​పోస్టు ద్వారా పంపడం ఆపేస్తున్నారు. దీంతో వాహనదారులు ఆఫీసులకే వస్తుండడంతో వారి దగ్గర రూ.200 నుంచి రూ.300 తీసుకుంటున్నారు.

దీనిని నివారించడానికే స్మార్ట్​కార్డుల జారీని జోనల్​ఆఫీసుల నుంచి మార్చి ఖైరతాబాద్​సెంట్రల్​ఆఫీసుకు బదలాయించనున్నట్టు సమాచారం. అలాగే, స్మార్ట్​ కార్డుల జారీని ప్రైవేట్​సంస్థలకు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీఏ అధికారులే స్మార్ట్​కార్డులను  తయారు చేస్తున్నారు. ప్రింటింగ్​పేపర్, రిబ్బన్, ఇంకును బయటే కొంటున్నారు. వీటిని సకాలంలో సరఫరా చేయకపోవడంతో కొన్ని సార్లు ప్రింటింగ్​ఆలస్యమై వేలకొద్దీ కార్డుల డెలివరీ కావడం లేదు. దీంతో ప్రైవేట్​సంస్థలకు ఇచ్చే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు.