ఉగాండా స్కూల్​లో.. 41 మంది ఊచకోత

ఉగాండా స్కూల్​లో.. 41 మంది ఊచకోత
  • తిరుగుబాటుదారులపనే అంటున్న ప్రభుత్వం
  • స్టూడెంట్లపై కత్తులతో దాడి చేసి.. హాస్టల్​కు నిప్పు పెట్టి దారుణం
  • మరో ఆరుగురిని కిడ్నాప్ చేసి కాంగో వైపు పరారైన దుండగులు

కంపాలా(ఉగాండా): ఉగాండాలో ఘోరం చోటుచేసుకుంది. కాంగో సరిహద్దుల్లోని ఓ స్కూలుపై తిరుగుబాటుదారులు దాడి చేశారు. శుక్రవారం రాత్రి హాస్టల్​లో నిద్రిస్తున్న విద్యార్థులపై విరుచుకుపడ్డారు. కత్తులతో దాడి చేస్తూ, తుపాకులతో కాల్పులు జరుపుతూ మారణహోమం సృష్టించారు. ఆపై బిల్డింగ్​ కు నిప్పుపెట్టి పరారయ్యారు. ఆరుగురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దుండగులు కాంగో బార్డర్ వైపు వెళ్లారని స్థానికులు చెప్పారు. స్కూలు బిల్డింగ్​ తగలబడిపోతుండడంతో దగ్గర్లోని ఆర్మీ బ్రిగేడ్ స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.

మంటలు ఆర్పుతూ లోపల చిక్కుకున్న విద్యార్థులను కాపాడేందుకు సైనికులు ప్రయత్నించారు. బిల్డింగ్​ లోపలి నుంచి 41 డెడ్​ బాడీలను బయటకు తీసుకొచ్చారు. ఇందులో 38 మృతదేహాలు కాలిపోయాయని, కొన్ని గుర్తుపట్టలేనంతగా మారిపోయాయని అధికారులు తెలిపారు. కాగా, అలైడ్​ డెమోక్రాటిక్​ ఫోర్సెస్(ఏడీఎఫ్) సభ్యులే ఈ దాడికి పాల్పడ్డారని ఉగాండా ప్రెసిడెంట్​యువెరి ముసావెని ఆరోపించారు. ప్రతీ విద్యార్థికి స్కూలు ఓ భద్రమైన ప్రదేశంగా ఉండాలని, స్కూలుపై దాడి చేయడమంటే పిల్లల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడ్డవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని ప్రెసిడెంట్​ తేల్చిచెప్పారు.

కాంగో బార్డర్ కు దగ్గర్లో స్కూలు..

ఉగాండా, కాంగో సరిహద్దుల్లో ఉగాండా ప్రభుత్వానికి పెద్దగా పట్టులేదు. దీనిని అవకాశంగా తీసుకున్న పలు తిరుగుబాటు దళాలు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నాయి. ఇందులో ఏడీఎఫ్​ కూడా ఒకటి. ప్రెసిడెంట్​ ముసావెని పాలసీలను వ్యతిరేకిస్తూ ముస్లిం కమ్యూనిటీ ఏర్పాటు చేసిన తిరుగుబాటు గ్రూపే ఈ ఏడీఎఫ్. తాజాగా కాంగో బార్డర్ కు దగ్గర్లోని లైబీరియా సెకండరీ స్కూలుపై ఏడీఎఫ్ సభ్యులు ఐదుగురు దాడి చేశారని తెలుస్తోంది. నిద్రిస్తున్న స్టూడెంట్లపై కత్తులు, తుపాకులతో దాడి చేశారు. దీంతో 41 మంది విద్యార్థులు చనిపోయినట్లు లైబీరియా మేయర్ తెలిపారు. హాస్టల్​లోని ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను దోచుకున్నారని చెప్పారు. దోచుకున్న వాటిని మోసుకెళ్లేందుకు ఆరుగురిని వెంట తీసుకెళ్లారని వివరించారు.