న్యూఢిల్లీ, వెలుగు: పద్మ శ్రీ అవార్డు అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అపోలో క్యాన్సర్ సెంటర్స్ (హైదరాబాద్) డైరెక్టర్, క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డి తెలిపారు. ఈ గుర్తింపు కేవలం తన ఒక్కడికే కాదని, ఆంకాలజీ రంగంలో సేవలందిస్తున్న సహచర వైద్యులు, మార్గదర్శకులు, రోగులు, కుటుంబ సభ్యులందరికీ దక్కిన గౌరవమని చెప్పారు.
సోమవారం ఢిల్లీలోని అశోక హోటల్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డును విజయ్ఆనంద్రెడ్డి అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఈ అవార్డు సమాజానికి మరింత సేవ చేయాలనే సంకల్పాన్ని బలపరుస్తోంది.
ధైర్య సాహసాలతో పోరాడుతున్న చిన్నారులు, ఆయా కుటుంబాలకు దీన్ని అంకితం చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. మరోవైపు వైద్యరంగంలో గూడురు వెంకటరావు, కళారంగంలో దీపికారెడ్డి కూడా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ తమకు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పురస్కారం తమపై మరింత బాధ్యత పెంచిందని తెలిపారు.
