తహసీల్దార్​ ఆఫీసుల్లో రిసెప్షన్​ కౌంటర్లు

తహసీల్దార్​ ఆఫీసుల్లో రిసెప్షన్​ కౌంటర్లు

రెవె‘న్యూ’ సెంటర్లు 
తహసీల్దార్​ఆఫీసుల్లో రిసెప్షన్​ కౌంటర్లు
ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక చర్యలు

భైంసా, వెలుగు: తహసీల్దార్​ఆఫీసులకు వచ్చే ఫిర్యాదుదారులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అన్ని తహసీల్దార్​ఆఫీసుల్లో రిసెప్షన్​ కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని తహసీల్దార్​ఆఫీసుల్లో ఈ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా 51 మండలాలు ఉన్నాయి. నాలుగు జిల్లా కేంద్రాలు ఉండగా.. 11 వరకు పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లో ఉన్న తహసీల్దార్​ఆఫీసుల్లో సర్కారు రిసెప్షన్​ కౌంటర్లను ఏర్పాటు చేసింది. కొన్ని ఆర్డీవో ఆఫీసుల్లో కూడా వీటిని ఏర్పాటు చేసింది. ఆఫీసుల్లో ఎంట్రన్స్​దగ్గరే ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. టేబుల్, క్యాబిన్, కుర్చీలతోపాటు ఇతర సామగ్రిని సమకూర్చింది. ప్రతి రిసెప్షన్​ కేంద్రంలో ఆయా కార్యాలయాల్లోని ఒక ఆఫీసర్​, సిబ్బంది పని వేళల్లో అందుబాటులో ఉంటూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

చక్కర్లు కొట్టే అవసరం లేదు

ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం ఇన్నాళ్లు ఆఫీస్​ల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. తహసీల్దార్​ఆఫీసులో ఫిర్యాదు పత్రాలు ఇచ్చేందుకు గానీ, రిసీవ్డ్​ కాపీ తీసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడేవి. కొన్ని సమయాల్లోనైతే సంబంధిత ఆఫీసర్​అందుబాటులో లేకపోతే రెండు, మూడుసార్లు తిరగాల్సి వచ్చేంది.  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్​ కౌంటర్​తో ఆ బాధలు తప్పాయి. ఫిర్యాదుదారులు ఆఫీస్​కు రాగానే.. అక్కడున్న ఆఫీసర్, సిబ్బంది ఫిర్యాదు తీసుకుంటారు. ఆ ఫిర్యాదు ఆఫీస్​లో ఏ విభాగానికి సంబంధించిందో ఆ అధికారి వద్దకు స్వయంగా తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. అటు ఫిర్యాదుదారుడికి జవాబుదారీగా ఈ వ్యవస్థ పని చేయనుంది.