భారత స్టూడెంట్లకు 90 వేల అమెరికా వీసాలు

భారత స్టూడెంట్లకు 90 వేల అమెరికా వీసాలు
  • రికార్డు స్థాయిలో జారీ చేశామన్న యూఎస్​ ఎంబసీ

న్యూఢిల్లీ :  ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు నెలల్లో భారత విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసింది. ఉన్నత విద్యను అభ్యసించడానికి భారత్​ నుంచి దరఖాస్తు చేసుకున్న 90 వేల కంటే ఎక్కువ మందికి వీసాలు జారీ చేసినట్టు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్)లో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ నాలుగు విద్యార్థి వీసాలలో ఒకటి భారతీయ విద్యార్థికి జారీ అయిందని పేర్కొంది. ఈమేరకు యూఎస్​ఎంబసీ భారత విద్యార్థులకు గ్రీటింగ్​చెప్పింది.

"తమ ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి అమెరికాను ఎంచుకున్న విద్యార్థులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు" అని ఎక్స్​లో పేర్కొంది. తమ టీమ్‌‌ వర్క్, ఇన్నోవేషన్‌‌తో అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ సరైన సమయంలో వీసాలు అందించామని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఉన్నత విద్య​కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోందని తాజా నివేదిక వెల్లడించింది.