మక్కలు కొనాలంటే సర్కారుకు తిప్పలే...ఈ యేడు యాసంగిలో రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు

మక్కలు  కొనాలంటే సర్కారుకు తిప్పలే...ఈ యేడు యాసంగిలో రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు
  •     గత సీజన్ లో 3.75లక్షల టన్నులు కొన్న ప్రభుత్వం
  •     యాసంగిలో కొనుగోళ్లు రెట్టింపయ్యే అవకాశం
  •     ఈ సీజన్​లో 11.40 లక్షల ఎకరాల్లో సాగు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన మొక్కజొన్న చేన్లే కనిపిస్తున్నయి. యాసంగిలో మొక్కజొన్న భారీగా సాగైంది. సాధారణ సాగును మించి177 శాతంగా నమోదైంది. యాసంగిలో ఇప్పటివరకు అన్ని రకాల పంటలు 76.25లక్షల ఎకరాల్లో సాగవగా అందులో మక్కలే 11.40 లక్షల ఎకరాలు. మొత్తంగా  15 శాతం. ఈ పరిస్థితి చూస్తే యాసంగిలో మక్కలు కొనాలంటే సర్కారుకు తిప్పలు తప్పవని తెలుస్తోంది.

నిరుటి కంటే 4 లక్షల ఎకరాలు అధికం

యాసంగి సీజన్ లో మక్కల సాగు రికార్డులు సృష్టించింది. ఈ సీజన్​లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 6.45 లక్షల ఎకరాలు, కానీ ఇప్పటికే 11.40 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఇది లాస్టియర్​కంటే 4లక్షల ఎకరాలు అధికం. ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా 1.69 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేశారు. నాగర్​ కర్నూల్​జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 1.35 లక్షల ఎకరాల్లో, మహబూబాబాద్​జిల్లాలో1.02 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. 

నిర్మల్, వరంగల్​జిల్లాల్లో లక్ష ఎకరాల చొప్పున, భద్రాద్రి కొత్తగూడెంలో 72 వేలు, హన్మకొండలో 65 వేలు, గద్వాలలో 47 వేలు,  కామారెడ్డిలో 34 వేలు, నిజామాబాద్​లో 32 వేలు, జగిత్యాల జిల్లాలో 31వేల ఎకరాల్లో మక్కల సాగు నమోదైంది. గతేడాది ఇదే టైమ్​లో 7.44లక్షల ఎకరాల్లో మక్కలు సాగవగా ఇప్పుడు నిరుటికంటే దాదాపు 4 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు చేశారు.

28.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా

గత రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మక్కలకు మద్దతు ధర కల్పించి రైతుల నుంచి కొనుగోళ్లు చేస్తోంది.  మార్కెట్​లో మద్దతు ధర కంటే తక్కువకే విక్రయాలు జరుగుతుంటే అప్రమత్తమైన సర్కారు వెంటనే మార్క్​ఫెడ్​ను నోడల్​ఏజెన్సీగా రంగంలోకి దించి కొనుగోలు చేస్తోంది. గత వానాకాలంలోనూ రూ.800 కోట్లకు పైగా వెచ్చించి దాదాపు 3.75 లక్షల టన్నులకు పైగా మక్కలను సేకరించింది. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ మక్కలు కొంటుండడంతో భరోసాతో రైతులు యాసంగిలో భారీ స్థాయిలో సాగును పెంచారు. మార్కెటింగ్ ఇబ్బందులూ తప్పడంతో గతంలో కంటే యాసంగిలో మక్కల సాగు గణనీయంగా పెరిగింది. 

ఫలితంగా యాసంగిలో మక్కలు కొనుగోళ్లు గత వానాకాలం కంటే రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈసారి 11.40 లక్షల ఎకరాల్లో సాగు చేయగా కనీసం 28.50 లక్షల టన్నుల మక్కల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెల నుంచి పంట  మార్కెట్​లోకి రానుండడంతో గత సీజన్​కంటే అధికంగా కొనుగోళ్లు చేసేందుకు సర్కారు సన్నాహాలు చేయాల్సిన అవసరం ఉంది.