
- చిన్నకోడూరులో 15 వేల ఓట్ల తేడాతో నెగ్గిన టీఆర్‌ఎస్ క్యాండిడేట్ రోజాశర్మ
- కాగజ్‌నగర్‌లో 12 వేల మెజార్టీ
వెలుగు నెట్‌వర్క్: జడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న మెజార్టీ రికార్డు బ్రేక్ అయింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు జడ్పీటీసీకి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన వేలేటి రోజాశర్మ 15,303 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీని సాధించారు. ఆమెకు మొత్తం 20, 358 ఓట్లు రాగా.. కాంగ్రెస్ క్యాండిడేట్ లక్ష్మికి 5,055 ఓట్లు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ లక్ష్మికి 830 ఓట్లు వచ్చాయి. రోజా శర్మ ఇటీవల టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగారు. ఆమె భర్త రాధాకృష్ణ శర్మ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. చిన్నకోడూరు తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో భారీ మెజార్టీ నమోదైంది. ఇక్కడ జడ్పీటీసీ క్యాండిడేట్‌గా టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన కోనేరు కృష్ణారావు(ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు) కాంగ్రెస్ క్యాండిడేట్‌పై12,438 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గతంలో రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ చేసి 9 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఇదే ఇప్పటి వరకు రికార్డు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.
ఒకట్రెండు ఓట్లతో గెలుపు..
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బాబు క్యాంపు-1 ఎంపీటీసీకి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కూసన వీరభద్రం కేవలం ఒక్క ఓటుతో విజయం సాధించారు.
- కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పెంట్లం ఎంపీటీసీ సీటుకు కాంగ్రెస్నుంచి పోటీ చేసిన సీతామహాలక్ష్మి రెండు ఓట్లతో గెలిచారు.
- మణుగూరు మండలం కూనవరం–3 ఎంపీటీసీకి పోటీ చేసిన టీఆర్ఎస్ క్యాండిడేట్ మచ్చా సమ్మక్క మూడు ఓట్లతో నెగ్గారు.
- పాల్వంచ మండలం సత్యనారాయణపురం ఎంపీటీసీకి పోటీ చేసిన టీఆర్ఎస్ క్యాండిడేట్ వి.రవి ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచారు.