దంచికొట్టిన వాన...రికార్డు స్థాయిలో వర్షపాతం

దంచికొట్టిన వాన...రికార్డు స్థాయిలో వర్షపాతం

భారీ వర్షం..ఎటు చూసినా...నీళ్లే..ఎక్కడ చూసినా కాలువలే..ఏప్రిల్ 29వ తేదీ హైదరాబాద్ ఒక్కసారిగా సముద్రాన్ని తలపించింది. భారీ వర్షం..కాదు కాదు..అతి భారీ వర్షం..నగరాన్ని అతలాకుతలం చేసింది. వాహనాలను ఇబ్బందుకు గురి చేసింది. కుండపోతగా కురిసిన వాన జనాన్ని అవస్థల పాలు చేసింది. భారీ వర్షానికి  లోతట్టు  పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. స్థంభాలు విరిగిపడ్డాయి. కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. 
 
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ విలేజ్ లోని తెల్లవారుజామున కురిసిన వర్షానికి పార్కు నీటిమయంగా మారింది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీలో వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పంచవటి కాలనీ రోడ్ నెంబర్ 10 లో రోడ్డుపై  వర్షపు నీరు నిలిచిపోయింది. 

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. భారీ వర్షానికి లకిడికపూల్ మెట్రో స్టేషన్ కింద వర్షపు నీరు నిలిచిపోయింది. అటు ఉప్పల్,రామంతపూర్,అంబర్ పెట్ లో భారీ వర్షం కొట్టింది.  బషీర్ బాగ్ , అబిడ్స్ , నారాయణగూడ,ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది.  చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో వాన నీరుచేరడంతో నదులను తలపిస్తున్నాయి. 

రికార్డు స్థాయి వర్షపాతం..

హైదరాబాద్లో గంట వ్యవధిలోనే 7.8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అత్యధిక వర్షపాతం హిమాయత్‌నగర్‌, శేరిలింగంపల్లిల్లో నమోదైంది. హిమాయత్ నగర్- 7.8, శేరి లింగంపల్లి- 7.4 వర్షం కురిసింది.  మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌, నాంపల్లిలో 6  సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఉప్పల్‌, ఆసిఫ్‌నగర్‌, బాలానగర్‌లో అయిదు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం కురిసిందని పేర్కొంది. 

మరో నాలుగు రోజులు..

రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 29వ, 30వ తేదీల్లో  వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది.  ఏప్రిల్ 29వ తేదీ  దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. .30వ తేదీన ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.