ఎర్రచెప్పులు, హెయిర్ స్టైల్ హంతకుడిని పట్టించాయి

ఎర్రచెప్పులు, హెయిర్ స్టైల్ హంతకుడిని పట్టించాయి

బాలాపూర్ మండల పరిధిలో జరిగిన ఏడేళ్ల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడిని కిడ్నాప్ చేసి హత్యచేసిన నిందితుడిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించినట్టు అదనపు డీసీపీ టాస్క్ ఫోర్స్ చైతన్యకుమార్ వివరాలు వెల్లడించారు. జల్ పల్లిలోని వాది ఇ ముస్తఫా కాలనీకి చెందిన ఓ వ్యక్తి, తన ఏడేళ్ల కుమారుడు మహ్మద్​ యాసిన్​తో ఉంటున్నాడు. ఈ నెల 8న రాత్రి 9గంటల సమయంలో బాలుడు కూల్ డ్రింక్ కోసం పక్కనే ఉన్న షాపుకు వెళ్లాడు. ఒంటరిగా కనిపించిన బాలుడిని అక్కడే ఉన్న ఓమర్ బిన్ హస్సన్(25) కిడ్నాప్ చేశాడు. దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలుడు అరవడంతో అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ మహిళ బయటకు వచ్చింది. తన మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ వేసి పరిశీలించింది. దీంతో బాలుడి తలపై హస్సన్​రాయితో మోది హతమార్చి అక్కడి నుంచి పారిపోయాడు.

టాస్క్ ఫోర్స్ పోలీసుల దర్యాప్తు…

బాలుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పహడీషరీఫ్​పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకి కోసం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో గాలింపు చేపట్టారు. బాలుడు హత్యకు గురైన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించారు. ఘటనా స్థలం నుంచి 200 మీటర్ల దూరంలో ఓ వ్యక్తి పరుగెత్తడం గుర్తించారు. కాళ్లకు వేసుకున్న స్లిప్పర్స్ తప్ప హత్యచేసిన వ్యక్తి ఆధారాలు లభించలేదు. వీడియో ఫుటేజ్ లను నిశితంగా పరిశీలించడంతో అతని ఒంటిపై ఉన్న డ్రెస్, కాళ్లకున్న రెడ్ కలర్ స్లి్ప్పర్స్ గుర్తించారు. దీంతో పాటు వెనుక బాగంలోని హెయిర్ స్టైల్ ను గమనించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిసర ప్రాంతాల్లోని అనుమానితులను విచారించారు. ఓమర్ బిన్ హస్సన్​ అదే పోలికలతో ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఘటన తర్వాత వాది ఇ ముస్తఫా కాలనీలో కాకుండా న్యూ హుడా కలానీలోకి అతను మఖాం మార్చినట్లు తెలుసుకున్నారు. ఓమర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా లైంగిక దాడికి యత్నించి బాలుడిని తానే చంపినట్టు అంగీకరించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగానే ఈ కేసును ఛేదించినట్లు డీసీపీ చైతన్య కుమార్ వివరించారు.