డిగ్రీలో క్రెడిట్స్ తగ్గుతున్నయ్.. మూడేండ్లలో 150 నుంచి 124కు కుదింపు

డిగ్రీలో క్రెడిట్స్ తగ్గుతున్నయ్.. మూడేండ్లలో 150 నుంచి 124కు కుదింపు

హైదరాబాద్, వెలుగు: వచ్చే కొత్త విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ కోర్సుల్లో క్రెడిట్స్ సంఖ్యను తగ్గించేందుకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్‌ఈ) నిర్ణయించింది. ప్రస్తుతం 150 క్రెడిట్స్‌ ఉన్న సిస్టమ్‌ను 124కు కుదించనున్నారు. ఈ మార్పుల్లో భాగంగా సిలబస్‌లోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. ప్రధానంగా లాంగ్వేజీ సబ్జెక్టుల్లో క్రిడిట్స్‌ను తగ్గిస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

దేశవ్యాప్తంగా మూడు, నాలుగేండ్ల యూజీ కోర్సుల్లో మార్పుల కోసం ‘కరికులమ్ అండ్ క్రెడిట్ ఫ్రెమ్ వర్క్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్’ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల రిలీజ్ చేసింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆదేశించింది. యూజీసీ ఆదేశాలకు అనుగుణంగా టీజీసీహెచ్‌ఈ ఈ కొత్త క్రెడిట్స్ విధానానికి శ్రీకారం చుట్టింది. 

2019–20 విద్యాసంవత్సరం నుంచి మూడేండ్ల డిగ్రీ కోర్సులు బీఏ, బీకామ్, బీఎస్సీలో 150 క్రెడిట్స్ ఉండగా, దాన్ని వచ్చే కొత్తసంవత్సరం నుంచి 124కు తగ్గించాలని నిర్ణయించారు. దీనికోసం టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో వివిధ సబ్జెక్టు నిపుణులు, పలు వర్సిటీల బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌(బీఓఎస్‌) ప్రతినిధులు, వర్సిటీ రిజిస్ట్రార్లతో సమావేశాలు నిర్వహించింది. వారి నుంచి తీసుకున్న సలహాలు, సూచనలకు అనుగుణంగా పలు సబ్జెక్టుల్లో క్రెడిట్స్‌పై నిర్ణయం తీసుకున్నారు. 

తొలి రెండేండ్లే లాంగ్వేజీ సబ్జెక్టులు.. 

డిగ్రీలో ఆరు సెమిస్టర్లకు గాను రెండు కోర్ సబ్జెక్టులకు 60 క్రెడిట్స్ కొనసాగించనున్నారు. ప్రతి సెమిస్టర్‌‌కు ఐదు క్రెడిట్స్ ఉంటాయి. మైనర్ కోర్సులో 22 క్రెడిట్స్, ఫస్ట్ లాంగ్వేజీ, సెకండ్ లాంగ్వేజీల్లో 12 చొప్పున క్రెడిట్స్ పెట్టనున్నారు. అయితే, గతంలో లాంగ్వేజీలకు 20 క్రెడిట్స్ చొప్పున ఉండగా, దానిని 12కు కుదించారు. గతంలో మూడేండ్ల పాటు లాంగ్వేజీ సబ్జెక్టులు ఉండగా, వచ్చే ఏడాది నుంచి తొలి రెండేండ్లు మాత్రమే ఉంటాయి. 

చివరి ఏడాది మల్టీ డిసిప్లినరీ కోర్సులు(ఎండీసీ), వాల్యు యాడెడ్ కోర్సు (వీఏసీ)లు పెట్టారు. ఇక నుంచి ఐదు, ఆరు సెమిస్టర్లలో ఇంటర్న్‌షిప్‌లు కొనసాగించనున్నారు. ఒక్కో ఇంటర్న్‌షిప్‌కు రెండు క్రెడిట్స్ ఇవ్వనున్నారు. వీటితో పాటు నాన్ సీజీపీఏ కేటగిరీలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లకు క్రెడిట్స్ ఇవ్వనున్నారు. క్రెడిట్స్ విధానానికి అనుగుణంగా సిలబస్‌నూ తగ్గించనున్నారు. 


యూజీసీ ఆదేశాలతోనే.. 

యూజీసీ ఆదేశాల మేరకు కొత్త క్రెడిట్స్ విధానాన్ని అమలు చేయబోతున్నాం. గతంలో 150 క్రెడిట్స్ ఉంటే.. దానిని 124 నుంచి 130కి కుదించబోతున్నాం. కొత్తగా చేరే డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్లకు నూతన క్రెడిట్స్ విధానం అమలు కాబోతుంది. సిలబస్ కూడా తగ్గించబోతున్నాం. కొత్త విధానంలో కోర్ సబ్జెక్టులకు ప్రయారిటీ ఇచ్చాం. 
-  బాలకిష్టారెడ్డి, టీజీసీహెచ్‌ఈ చైర్మన్