
- గతేడాది కన్నా 3,378.38 కోట్లు తక్కువ
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్‌లో విద్యారంగానికి ఈసారీ కోత తప్పలేదు. గతేడాదితో పోలిస్తే నిధులకు భారీ కోతపడింది. స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల కేటాయింపులను తగ్గించారు. 2019–-20 విద్యాసంవత్సరానికి బడ్జెట్‌లో రూ.9,899.80 కోట్లను ప్రతిపాదించారు. ప్రగతిపద్దు కింద రూ.751.31 కోట్లు, నిర్వహణ పద్దు కింద 9,148.48 కోట్ల ఇచ్చారు. ఉద్యోగుల జీతాలు, టీఏ, డీఏలకు కూడా సరిపోయేలాలేవని అధికారులు అంటున్నారు. గతంలో విద్యారంగాన్ని ప్రాధాన్యరంగంగా ప్రకటించినా, 2018–-19 ఏడాదితో పోలిస్తే ఏకంగా రూ.3378.38 కోట్లు కోత పడటం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఫిబ్రవరి 25న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్‌బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.12,220.75 కోట్ల మేర నిధులు కూడా ఈసారి కేటాయించకపోవడంపై విద్యావేత్తలు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
స్కూల్ ఎడ్యుకేషన్‌కు 2621.28 కోట్ల కోత..
పాఠశాల విద్యాశాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో భారీగా నిధులు తగ్గాయి. మొత్తం రూ.8,209.01 కోట్ల అంచనా బడ్జెట్‌ను ప్రతిపాదించగా, దీంట్లో నిర్వహణ పద్దు కింద రూ.7515.64 కోట్లు, ప్రగతిపద్దు కింద కేవలం రూ.693.37 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే స్కూల్ ఎడ్యుకేషన్‌లోనే రూ.2,621.28 కోట్ల కేటాయింపులు తగ్గాయి. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీకి నిర్వహణ పద్దు కింద రూ.122.52 కోట్లు, టెక్స్ట్ బుక్ ప్రెస్‌కు రూ.4.20 కోట్లు, గ్రంథాలయ శాఖకు రూ.50.31 కోట్లు, పరీక్షల విభాగానికి రూ.11.67 కోట్లు కేటాయించారు. సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ)కు కేవలం 135.41 కోట్లను ప్రగతిపద్దు కింద చూపించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తరపున అందే పథకాలన్నీ ఆగిపోయే అవకాశముంది.
హయ్యర్ ఎడ్యుకేషన్ ఆగమాగం..
ఉన్నత విద్యాశాఖకు ఈ ఏడాదీ సమస్యలు తప్పేలా లేవు. ఈ ఏడాది రూ.1,367.88 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దీంట్లో నిర్వహణ పద్దు రూ.1,312.55 కోట్లుండగా, ప్రగతి పద్దు రూ.55.32 కోట్లున్నది. గతేడాది కన్నా ఏకంగా 657.69 కోట్లు తక్కువ. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌కు రూ.484.99 కోట్లను ప్రభుత్వం కేటాచించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.166.88 కోట్లు తగ్గించింది. దీంతో ఈ ఏడాది కూడా మిడ్ డే మిల్స్ లేనట్టేనని స్పష్టమవుతోంది.
టెక్నికల్‌లోనూ కట్టింగ్..
సాంకేతిక విద్యాశాఖకు నామమాత్రంగా నిధులిచ్చారు. రూ.322.91 కోట్లు ప్రతిపాదించారు. గతేడాది అంచనా బడ్జెట్‌తో పోలిస్తే రూ.99.41 కోట్లకు కోతపడింది.
సాంకేతిక విద్య పరిధిలోని సంస్థలకు నిధులు (కోట్లలో)
జేఎన్టీయూహెచ్ 66.04
ఆర్‌జీయూకేటీ 20.12
జేఎన్‌టీయూఫైన్ ఆర్ట్స్ 16.23
కరీంనగర్(జేఎన్టీయూ) 5.03
సుల్తాన్‌పూర్(జేఎన్టీయూ) 4.59
మంథని(జేఎన్టీయూ) 57.48 లక్షలు