- కిందికి దిగుతుండగా విరిగిపోయిన మెట్లు.. కిందపడ్డ ముగ్గురు బాలురు
- ఉత్తరప్రదేశ్లో ఘటన.. ఒకరు మృతి
- ఇద్దరిని కాపాడిన ఐఏఎఫ్ హెలికాప్టర్
సిద్ధార్థనగర్(ఉత్తరప్రదేశ్): సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రాణాలను పణంగా పెట్టి చేసే స్టంట్లు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. రీల్స్ చిత్రీకరించేందుకు వాటర్ ట్యాంక్ ఎక్కిన ఐదుగురు చిన్నారుల్లో ఒకరు కిందపడి మృతి చెందగా, ట్యాంక్ పైన చిక్కుకుపోయిన మరో ఇద్దరిని భారత వైమానిక దళం రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధార్థనగర్ జిల్లాలో శనివారం ఐదుగురు చిన్నారులు వీడియో (రీల్) తీయడంకోసం 60 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కారు.
అయితే, వారు తిరిగి కిందకు దిగుతున్న క్రమంలో పిల్లల బరువును తట్టుకోలేక ఆ నిచ్చెన ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో ముగ్గురు పిల్లలు దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో సిద్ధార్థ్ (13) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నిచ్చెన విరిగిపోవడంతో మిగిలిన ఇద్దరు పిల్లలు ట్యాంక్ పైనే చిక్కుకుపోయారు.
రంగంలోకి వైమానిక దళం..
పరిస్థితి తీవ్రతను గమనించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయాన్ని కోరారు. అర్ధరాత్రి సమయంలో రంగంలోకి దిగిన హెలికాప్టర్ ఆ ఇద్దరు పిల్లలను సురక్షితంగా లిఫ్ట్ చేసింది. దాదాపు 16 గంటల ఉత్కంఠ తర్వాత ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు ఆ పిల్లలు క్షేమంగా బయటపడ్డారు.
