- జీసీసీల ఏర్పాటులో దేశంలోనే హైద్రాబాద్ రెండో స్థానానికి చేరిందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ దిగ్గజ సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీసీసీల ఏర్పాటులో ముంబై, ఢిల్లీ, చెన్నైలను దాటేసి హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందన్నారు. జీసీసీలు రావడం వల్ల తెలంగాణ ఐటీ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్ దిగ్గజం 'రీజెనరాన్' సంస్థ హైదరాబాద్‌లో తన జీసీసీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రీజెనరాన్ సంస్థకు ఇప్పటికే ఐర్లాండ్, బ్రిటన్, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలలో కార్యాలయాలు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
అయినప్పటికీ హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోయే జీసీసీ వీటన్నింటికంటే ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు.ఈ కొత్త కేంద్రం ప్రపంచవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను సమన్వయం చేస్తుందని మంత్రి వివరించారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, అధునాతన డేటా సైన్స్,ఏఐ ఇంజినీరింగ్, కమర్షియల్ అనలిటిక్స్ వంటి అత్యున్నత స్థాయి డిజిటల్ సేవలను ఇక్కడి నుంచి అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 450 జీసీసీలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, మరిన్ని అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు.బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏఐ, డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో ఉన్న బలమైన ఎకోసిస్టం ప్రపంచ కంపెనీలను ఆకర్షిస్తోందని మంత్రి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిశోధన, తయారీ రంగం, పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. జీనోమ్ వ్యాలీ విస్తరణతో పాటు త్వరలో ఏర్పాటు కానున్న గ్రీన్ ఫార్మా సిటీ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.సమావేశంలో రీజెనరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యారి కోవాల్, జీసీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఓనాట్, సంస్థ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
