అందం వెనుక సీక్రెట్ చెప్పేసిన హీరోయిన్ రెజీనా కసాండ్రా

అందం వెనుక సీక్రెట్ చెప్పేసిన హీరోయిన్ రెజీనా కసాండ్రా

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి రెజీనా కసాండ్రా, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. 'శివ మనసులో శ్రుతి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత 'పిల్ల నువ్వు లేని జీవితం', 'రారా కృష్ణయ్య', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి కమర్షియల్ హిట్లతో పాటు 'ఎవరు', 'రాకెట్రీ' వంటి వైవిధ్యభరితమైన చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. గ్లామర్ పాత్రలే కాకుండా కంటెంట్ ఉన్న పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ నేటి తరం హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రస్తుతం రెజీనా కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తెలుగులో 'కైవల్య' అనే చిత్రంతో పాటు, తమిళంలో 'మూకుతి అమ్మన్ 2', 'ఫ్లాష్ బ్యాక్', 'కల్లపార్ట్' వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అటు వెబ్ సిరీస్ ప్రపంచంలోనూ తన ముద్ర వేసేందుకు సిద్ధమైంది; హాలీవుడ్ సిరీస్ 'మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్' స్ఫూర్తితో రూపొందుతున్న ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో నటిస్తోంది. బాలీవుడ్‌లో సైతం మధుర్ భండార్కర్ దర్శకత్వంలో 'ది వైవ్స్' , 'సెక్షన్ 108' చిత్రాలతో బిజీగా ఉంది.

తాజాగా శ్రీకాకుళం నగరంలో కలర్స్ నూతన బ్రాంచ్‌ను రెజీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా తన బ్యూటీ అండ్ ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను పంచుకుంటూ.. తనకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటానని వెల్లడించారు. దీనికి తోడు రెగ్యులర్ గా యోగా, సరైన డైట్ పాటించడం తో పాటు ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని, అధిక ఆలోచనలను దూరం చేసుకోవడమే ఆరోగ్యకరమైన జీవితానికి అసలైన రహస్యం అంటూ సీక్రెట్ వెల్లడించారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ హెల్త్ పై ఆమె చూపిస్తున్న శ్రద్ధ అభిమానులను ఆకట్టుకుంటోంది.