తెల్లారేసరికి అదనపు చార్జీలు కట్టాలని మెసేజ్లు

 తెల్లారేసరికి అదనపు చార్జీలు కట్టాలని మెసేజ్లు

రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లిన ప్రజల ఆందోళన
జగిత్యాల, వెలుగు:
జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన మారుతిరెడ్డి ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమి విక్రయించేందుకు ఈ నెల 31న స్లాట్ బుక్ చేసుకున్నాడు. గుంటకు రూ. 1000 చొప్పున 2.20 లక్షల ఫీజు కట్టారు. రిజిస్ట్రేషన్ కోసం మంగళవారం తహసీల్దార్​ఆఫీస్ కు వెళ్తే రూ. 1.10 లక్షలు అదనంగా కట్టాలని రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. అమౌంట్ పే చేస్తామని చెప్పగా మరోసారి ఆన్ లైన్ లో రీ షెడ్యూల్ చేసుకోవాలని చెప్పి ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. 
రాష్ట్ర సర్కార్ ఫిబ్రవరి1 నుంచి భూముల మార్కెట్ వాల్యూ పెంచుతున్నట్లు ప్రకటించడంతో వారం రోజులుగా ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం ధరణిలో స్లాట్స్ బుక్ చేసుకున్నారు. మీ సేవలకు, రెవెన్యూ ఆఫీస్ లకు ఒకే వెబ్ సైట్ ఉండటం, రిజిస్ట్రేషన్ స్లాట్స్ అధికంగా బుక్ కావడంతో సర్వర్ మొరాయించింది. వర్కింగ్ డేస్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక స్లాట్ చొప్పున సుమారు 28 స్లాట్స్ అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్ గా ప్రతిరోజు 10 వరకు రిజిస్ట్రేషన్స్ అయ్యేవి. రిజిస్ట్రేషన్స్ ధరలు పెంచుతున్నట్లు సర్కారు పేర్కొనడంతో అంతా రిజిస్ట్రేషన్​ఆఫీసులకు క్యూ కట్టారు.

దీంతో ఉన్న 28 స్లాట్స్ బుక్ అయ్యాయి. వెబ్ సైట్ మొరాయింపుతో చాలాచోట్ల కనీసం 5 రిజిస్ట్రేషన్లు కూడా కాలేదు. మరోవైపు గత నెల 31కి ముందు స్లాట్​బుక్ చేసుకున్న రైతులు కొందరికి ఈ నెల 1న డేట్​ఇచ్చారు. వారంతా పాత మార్కెట్​వాల్యూ ప్రకారం ఫీజు చెల్లించారు. వీరందరికి పాత రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉండగా ఆఫీసర్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. మంగళవారం రిజిస్ట్రేషన్ కోసం వెళ్లినవారందరికి పెరిగిన రేట్ల ప్రకారం మరో 50 శాతం అదనంగా చెల్లించాలని రెవెన్యూ ఆఫీసర్లు చెప్పారు. దీంతో పలుచోట్ల రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లినవారంతా ఆందోళనకు దిగారు. కొందరు చేసేదేం లేక అడిషనల్ చార్జీలు చెల్లించి మరో రోజు స్లాట్ రీ షెడ్యూల్ చేసుకుంటున్నారు. 
అడిషనల్ చార్జీలు కట్టమంటున్రు
గత నెల 31న నా పేరిట ఉన్న నాలుగు గుంటల వ్యవసాయ భూమి అమ్మేందుకు ధరణిలో స్లాట్‌బుక్ చేసుకుని రూ. 11వేలు చెల్లించా. తీరా మంగళవారం రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగా అడిషనల్ చార్జీలు 50 శాతం అంటే రూ. 5,500 వేలు చెల్లించాలని ఆఫీసర్లు చెప్పారు. చార్జీలు చెల్లించినా మరో స్లాట్ బుక్ చేసుకుని రావాలని ఆఫీస్​చుట్టూ తిప్పుతున్నారు. – సిరికొండ నారాయణ, లింగంపేట, జగిత్యాల
కొత్త చార్జీల ప్రకారం అమౌంట్ ​కడితే చేస్తున్నం
స్లాట్స్ బుక్ చేసుకుని కొత్త చార్జిల ప్రకారం అడిషనల్ అమౌంట్ కట్టిన వాళ్ల పేర్లు ధరణిలో చూపిస్తున్నాయి. అలాంటివాళ్ల రిజిస్ట్రేషన్లు చేశాం. ఇలా పది వరకు రిజిస్ట్రేషన్లు చేశాం.    -  దిలీప్ నాయక్, తహసీల్దార్, జగిత్యాల రూరల్