- నిలిచిపోయిన నిధుల విడుదలకు మార్గం సుగమం
- ఐఎఫ్ఎంఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో త్వరలో మార్పులు
- కొత్త చెక్కులు జారీ చేయొద్దని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు సంబంధించి నిలిచిపోయిన నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. 2025-=26 ఆర్థిక సంవత్సరం ముగింపులో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఐఎస్) ద్వారా గ్రామ పంచాయతీలు జారీ చేసిన చెక్కులన్నీ సాంకేతిక కారణాలతో రిజెక్ట్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 5వ తేదీన ‘వెలుగు పత్రిక’లో ‘పంచాయతీల్లో పాత బిల్లుల తిరస్కరణ.. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నిలిచిన చెక్కులు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది.
దీనిపై పంచాయతీరాజ్ఆఫీసర్లు స్పందించారు. రిజెక్ట్ అయిన చెక్కులన్నీ మరో రెండు మూడు రోజుల్లో తిరిగి యాక్టివేట్ అవుతాయని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గతంలో రిజెక్ట్ అయ్యాయని భావించి, అవే నిధులకు సంబంధించి కొత్తగా మళ్లీ చెక్కులు జారీ చేయవద్దని పంచాయతీ కార్యదర్శులను అధికారులు స్పష్టం చేశారు. పాత చెక్కులే ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయని, కొత్తవి జనరేట్ చేస్తే సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ అంశంపై జిల్లా పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని, తమ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులందరికీ ఈ సమాచారాన్ని చేరవేయాలని, పొరపాటున కూడా కొత్త చెక్కులు రైజ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆదేశాలను అందరికీ లిఖితపూర్వకంగా పంపి వారు నిబంధనలు పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించి కంప్లయన్స్ రిపోర్ట్ సమర్పించాలని డీపీఓలను ఆదేశించారు.
దీనివల్ల పంచాయతీల్లో నిధుల చెల్లింపు ప్రక్రియ సజావుగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, చెక్‌లను యాక్టివేట్ చేస్తామని ఉన్నతాధికారులు తెలియజేయడం పట్ల తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కర్ణకంటి నరేశ్ ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు, కమిషనర్ దివ్యదేవరాజన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
