ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్

ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్

ముంబయి: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముఖేశ్ అంబానీ కుటుంబాన్ని చంపుతానంటూ ఓ ఆగంతకుడు రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన రిలయన్స్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అఫ్జల్ అనే యువకుడు ఇవాళ ఉదయం రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కు ఫోన్ చేసి ముఖేశ్ అంబానీతో పాటు అతడి కుటుంబ సభ్యులను హతమారుస్తానంటూ బెదిరించాడు. ఫిర్యాదు అందడంతో ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు... గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు దాదాపు 8సార్లు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని, అతని మానసిక స్థితి బాగాలేదని పోలీసులు చెబుతున్నారు. బెదిరింపుల నేపథ్యంలో ముఖేష్ నివాసమైన ఆంటిలియా వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

ముఖేష్ అంబానీకి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గతేడాది అంబానీ నివాసం అంటిలియా దగ్గర పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో కలకలం సృష్టించింది. కొందరు దుండగులు జిలెటిన్ స్టిక్స్ ఉన్న కారును అంబానీ ఇంటి దగ్గర నిలిపారు. ఆ కారులో అంబానీని ఉద్దేశించి బెదిరింపు లేఖ దొరికింది.