
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేష్ అంబానీకి చెందిన టెల్కో రిలయన్స్ జియో దేశమంతటా 5జీ సేవలను అందించడానికి దాదాపు లక్ష టెలికాం టవర్లను ఏర్పాటు చేసింది. ఎయిర్‌టెల్ టవర్లతో పోలిస్తే వీటి సంఖ్య దాదాపు 5 రెట్లు ఎక్కువ. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లెక్కల ప్రకారం.. జియో దాని 2 ఫ్రీక్వెన్సీలలో (700 మెగాహెజ్, 3,500 మెగాహెజ్) 99,897 బీటీఎస్ (బేస్ ట్రాన్స్ రిసీవర్ స్టేషన్)లను ఇన్‌స్టాల్ చేసింది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో 22,219 బీటీఎస్‌లు మాత్రమే ఉన్నాయి. ప్రతి బేస్ స్టేషన్‌కు జియో 3 సెల్ సైట్లను నిర్మించడానికి, ఎయిర్‌టెల్ రెండు చొప్పున నిర్మించింది. ఎక్కువ టవర్ సెల్ సైట్స్ ఉండటం వల్ల నెట్ వేగం బాగుంటుంది. ఓక్లా ఫిబ్రవరి 28న విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. ఎయిర్‌టెల్5జీ స్పీడ్ 268 ఎంబీపీఎస్ కాగా, జియో నెట్వర్క్ స్పీడ్ 506 ఎంబీపీఎస్ (సెకనుకు మెగాబైట్లు) ఉంది. ఇండియాలో దాదాపు 50 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. స్మార్ట్ఫోన్ల వాడకం భారీగా పెరగడమే ఇందుకు కారణం. చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్‌గా నిలిచింది. 5జీ టెలికాం సేవలు 2022 అక్టోబర్‌లో ప్రారంభమయ్యాయి. 5జీ నెట్వర్క్ కోసం జియో 25 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది.
5జీకి పెట్టుబడులను పెంచుతున్న ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ తన మూలధన పెట్టుబడులను 4జీ నుంచి తన 5జీ నెట్‌వర్క్‌కు మళ్లిస్తోంది. అయితే 2జీ నెట్‌వర్క్‌ను మూసివేసే ఆలోచన లేదని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖోన్ తెలిపారు. తమ రేడియోలన్నింటినీ ఒకే ఆర్.ఎ.ఎన్లో నడుపుతున్నందున 2జీని నిర్వహించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువని, ఇప్పటికీ 2జీ ఫోన్లను ఉపయోగిస్తున్నవారి సంఖ్య భారీగా ఉంది కాబట్టి 2జీని ఆపేయబోమని స్పష్టం చేశారు. ఇండియాలో ఇప్పటికీ -35 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులు 2జీని ఉపయోగిస్తున్నారు. ఎయిర్‌టెల్‌కు దాదాపు 10 కోట్ల మందికిపైగా 2జీ యూజర్లు ఉన్నారు. కరోనాకు ముందే, ఎయిర్‌టెల్ తన 3జీ నెట్‌వర్క్‌ను మూసివేసింది. దాని రేడియోలను 4జీకి వాడుకుంటోంది.